19.2 C
Hyderabad
Friday, January 17, 2025
spot_img

నెల్లూరులో విరిగిన ఫ్యాన్‌ రెక్కలు

వైసీపీకి గతంలో పూర్తి సపోర్ట్‌గా ఉన్న జిల్లా.. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకంగా మారింది? అధినేత వైఎస్ జగన్ తొందరపాటు నిర్ణయాలతో కీలక నాయకులను పోగొట్టుకోవడమే కారణమా? అంటే అవుననే సమాధానంగా వస్తుంది. ఏపీలోని నెల్లూరు వైసీపీకి ఎంతో బాసటగా నిలిచిన జిల్లా. వైసీపీ ఏర్పాటు అయిన వెంటనే ఈ జిల్లా నుంచే ఆ పార్టీ జెండా ఎగిరింది. జగన్‌తో పాటు ఆనాడు తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రెండో వ్యక్తి.. సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆయన 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో నెల్లూరు నుంచి మరోసారి పోటీ చేసి వైసీపీ గుర్తు మీద తొలిసారి విజయ భేరీ మోగించారు. ఆ తరువాత నెల్లూరు అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరిగితే వైసీపీ అన్ని సీట్లూ గెలుచుకుని స్వీప్ చేసింది.

వైసీపీ ఏర్పడిన దగ్గర నుంచి ఆ పార్టీకి ఫుల్ సపోర్ట్‌గా ఉన్నది నెల్లూరు జిల్లానే. 2014 ఎన్నికల్లో నెల్లూరులో మూడు సీట్లు తప్ప అన్నీ గెలుచుకుంది. 2019లో వైసీపీ ప్రభంజనంలో పదికి పది సీట్లను గెలిచి ఆ పార్టీకి తిరుగేలేదని నిరూపించుకుంది. ఇలా మొదటినుంచి ఈ జిల్లా రాజకీయంగా వైసీపీకి సపోర్ట్‌గా ఉంటూ.. కొండంత అండగా నిలబడింది. అలాంటి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు వైసీపీకి ఎమ్మెల్యేలే లేకుండా పోయారు. నెల్లూరు ఎంపీతో పాటు.. 10 అసెంబ్లీ సీట్లు కూడా కూటమి పార్టీలకే దక్కాయి. ఇందుకు కారణం.. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో పెరిగిన వర్గపోరే అని చెబుతున్నారు. అప్పట్లో పార్టీ అధిష్టానం సరైన సమయంలో వర్గపోరుపై దృష్టి పెట్టి.. సమస్యను పట్టించుకోకపోవడంతో వైసీపీ బలహీనపడుతూ వచ్చింది. చివరకు ఆ జిల్లాలో పార్టీకి ప్రజా ప్రతినిధే లేకుండా పోయే పరిస్థితికి వచ్చింది.

2024లో జిల్లాలోని మొత్తం పది సీట్లనూ ఒక ఎంపీ సీటునీ కూటమి కైవశం చేసుకుంది. నెల్లూరు రాజకీయాల్లో మొదటి నుంచి వైసీపీలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి.. అలాగే 2019లో పార్టీలో చేరిన ఆనం రామ నారాయణరెడ్డి వంటి వారు పార్టీని వీడి పోవడం వల్ల కూడా తీవ్ర నష్టం జరిగింది. అంతే కాకుండా మూడేళ్ల పాటు మంత్రి పదవిలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్.. ఒంటెద్దు పోకడల వల్ల కూడా పార్టీలోని బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుందనే టాక్ ఉంది. చివరి రెండేళ్లు కాకాణి గోవర్ధనరెడ్డికి మంత్రి పదవి ఇచ్చినా.. పార్టీ పరిస్థితిని మాత్రం చక్కదిద్దలేకపోయారు.

ఇక సీనియర్ నేతగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రి పదవి దక్కనందుకు కొంతకాలం అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఎన్నికల్లో ఆయనను వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి కోవూరులో ఓడించారు. దాంతో ఆయన కూడా రాజకీయంగా అంత చురుకుగా లేరు. కందుకూరు, కావలి నియోజకవర్గాల్లో కూడా పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. దీంతో ఇప్పుడు జగన్ నెల్లూరు మీద మరోసారి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నెల్లూరులో పార్టీకి పూర్వ వైభవం తీసుకొని రావాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. దీన్ని జగన్ ఇప్పటికే గుర్తించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే నెల్లూరులో వైసీపీకి కంచుకోటలు ఎలా కూలిపోయాయి.. మొదటి నుంచి బలం తక్కువగా ఉన్న టీడీపీ ఎలా స్వీప్ చేసింది అన్నది లోతుగా విశ్లేషిస్తే కానీ.. పార్టీ పునర్ నిర్మాణం సాధ్యం కాదనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో ఉన్న నాయకులకు భరోసా కల్పించాల్సి ఉంది. అలాగే క్యాడర్ కి అండగా ఉండాల్సి ఉంది. అంతే కాదు రానున్న రోజులలో వైసీపీ పని చేయని నాయకులను తప్పించి.. కార్యకర్తలకు దగ్గరగా ఉండే నాయకులకు పదవులిచ్చేలా సంచలన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని.. అప్పుడే అనుకున్నలక్ష్యం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు.

మేకపాటి గౌతంరెడ్డి మంత్రిగా ఉంటూ మరణించిన తరువాత నుంచి పార్టీకి సరైన అండ ఆధారం లేకుండా పోయింది అన్న మాట ఉంది. అలాంటి నాయకత్వాన్ని మళ్లీ వైసీపీ వెతికి ముందున పెట్టాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా నెల్లూరు వైసీపీ నిరాశ నీడలో ఉంది. దానిని తిరిగి ఆశల పల్లకీలోకి తేవడం అంటే అంత సులువేమీ కాదు.. మరి ఈ విషయంలో జగన్ అడుగులు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.

Latest Articles

హోరా హోరీగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా కొనసాగుతోంది. నేటితో ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. నేటి సాయంత్రం 3 గంటలతో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈసీ సమయం ఇచ్చింది. నామినేషన్లను ఈసీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్