మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా సరే..పట్టుకోవద్దని అంటున్నారని..కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఏ ఒక్కరోజు కూడా నిరుద్యోగుల కోసం ఆలోచించలేదన్నారు. ఖైరతాబాద్‌లో ఏఎంవీఐలకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు.
ఉద్యోగాల కోసం నిరుద్యోగులు గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ బాట పట్టారన్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగులు ఆశపడ్డారని.. కానీ గత ప్రభుత్వం వారి ఆశల్ని భగ్నం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాకముందే 50వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లను విడుదల చేసి..నియామకాల ప్రక్రియను త్వరగా పూర్తిచేసేలా పర్యవేక్షిస్తామన్నారు.
నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించడం తనకు సంతృప్తినిస్తుందని సీఎం రేవంత్ అన్నారు. గత పాలకులు వాళ్ల ఉద్యోగాల గురించి మాత్రమే ఆలోచించారని అన్నారు. కొందరు డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా తమని పట్టుకోకూడదని వారు బెదిరిస్తున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని..ఫామ్ హౌస్‌లో కొందరు మద్యం తాగుతూ దీపావళి చేసుకుంటున్నారని వెల్లడించారు. 10 నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారని..ఒక పెద్దాయన అంటున్నారన్నారు. తెలంగాణ ఏమి కోల్పోలేదు, పెద్దాయన ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. చిచ్చుబుడ్లకు బదులు సారా బుడ్లతో కొందరు దీపావళి చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వం ఒక రెసిడెన్షియల్ స్కూల్ అయినా కట్టిందా అని నిలదీశారు. ఎలాంటి స్కూల్ నిర్మించలేదు, కానీ ఆయన మాత్రం 10 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారని విమర్శించారు. 2011లో రాష్ట్రంలో చివరిసారిగా గ్రూప్-1 పరీక్ష నిర్వహించారన్నారు. దాదాపు 13 సంవత్సరాలు ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదని చెప్పారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా పట్టుబట్టి గ్రూప్-1 పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. త్వరలో నియామక పత్రాలు అందజేస్తానని సీఎం చెప్పారు. అసెంబ్లీలో సమస్యలపై చర్చించటం ప్రతిపక్ష నేత బాధ్యత, ఆయన అసెంబ్లీకి రావాలని తామే అడగాల్సిన పరిస్థితి ఉందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.