హైదరాబాద్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించున్నారు. సాయంత్రం 4 గంటలకు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, AICC ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, MPలు, MLAలు, MLCలు, నాయకులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
గత కొంతకాలంగా తెలంగాణలో విగ్రహ రాజకీయం నడుస్తోంది. సచివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. రాజీవ్ గాంధీ విగ్రహానికి బదులు ఆ ప్రదేశంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించినట్లు బీఆర్ఎస్ చెబుతోంది. ఇప్పుడు అదే ప్రాంతంలో కాంగ్రెస్ సర్కార్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించాలనుకుంటోంది. అదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై BRS సహా తెలంగాణలోని ప్రజాసంఘాలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతోపాటు సీఎం రేవంత్ రెడ్డి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య వ్యక్తిగత ఆరోపణలకు దారితీసింది. ప్రస్తుతానికి రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడుతోంది.