సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలను కలిసేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇవాళ పార్టీ నాయకులతో పాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులతో కూడా సమావేశమవుతున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది.
పది రోజులపాటు అమెరికా, దక్షిణ కొరియాల్లో పర్యటించి పెట్టుబడుల గురించి పలు కంపెనీలతోనూ, ప్రపంచబ్యాంకు అధ్యక్షునితోనూ చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అక్కడ జరిగిన ఒప్పందాలు, వచ్చే పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలను అధిష్ఠానానికి నివేదించనున్నట్టు సమాచారం. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో పాల్గొన్న రాహుల్‌గాంధీ.. పార్టీ అధికారంలోకి వస్తే రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించగా, ఎన్నికల ప్రణాళికలో కూడా దీన్ని పొందుపరిచారు. ఈ హామీని అమలు చేసినందుకు.. వరంగల్‌లో భారీ బహిరంగసభ నిర్వహించే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. ఈ సభకు రాహుల్‌గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాహుల్‌గాంధీని ముఖ్యమంత్రి కలిసి ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పీసీసీ అధ్యక్షుడిగా కూడా రేవంత్‌రెడ్డే కొనసాగుతున్నందున కొత్త అధ్యక్షుడి నియామకంపై కొద్దికాలంగా కసరత్తు జరుగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకుల్లో ఒకరిని నియమిస్తారనే ప్రచారం చాలా రోజులుగా ఉన్నా పేర్ల మీద చర్చ తప్ప తుది నిర్ణయం జరగలేదు. మంత్రివర్గ విస్తరణ, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ లాంటి పదవుల విషయంలో సామాజిక సమతూకం పాటించాలని కూడా కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవికి మహేశ్‌కుమార్ గౌడ్, మధుయాస్కీ, సంపత్‌కుమార్, లక్ష్మణ్‌కుమార్, బలరాంనాయక్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మంత్రులుగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, సుదర్శన్‌రెడ్డి, వివేక్, ప్రేమ్‌సాగర్‌రావు, మదన్‌మోహన్‌రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారు.
తాను పార్టీలో చేరేటప్పుడే హామీ ఇచ్చారని రాజగోపాల్‌రెడ్డి చెబుతుండగా, ముదిరాజ్‌ల నుంచి శ్రీహరి పేరును ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డికి ఎక్కువ అవకాశాలున్నాయి. అసలు ప్రాతినిధ్యం లేని జిల్లాలు, వర్గాలకు విస్తరణలో అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్‌లను కూడా పరిగణనలోకి తీసుకుని ఏడెనిమిది పదవులకు వివిధ సామాజికవర్గాల నుంచి ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్… అధిష్ఠానాన్ని కలిసి విదేశీ పర్యటన వివరాలు చెప్పడం, ఫాక్స్‌కాన్ కంపెనీతో చర్చలు, ఒకరిద్దరు కేంద్రమంత్రులను కలవడం వరకే పరిమితం కావచ్చనే ప్రచారం కూడా ఉంది.