బీఆర్ఎస్, బీజేపీ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై…. 14 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయని పనులు తాము చేశామన్నారు. అయినా తమ పరిపాలన బాగాలేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కాంగ్రెస్ తరఫున నేను, దామోదర్ రాజనర్సింహ వస్తామని, చర్చకు సిద్ధమా అని సీఎం ప్రశ్నించారు. ప్రదేశం ఎక్కడో మీరే చెప్పండి అని విపక్ష నాయకులకు సీఎం సవాల్ విసిరారు. కృష్ణా నది నీళ్లు తరలించడానికి సహకరించింది మీరే కదా అంటూ నిప్పులు చెరిగారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయేందుకు అవకాశం కల్పించిందీ బీఆర్ఎస్‌నే అంటూ ఆరోపించారు. కృష్ణా జలాలను సీమకు తరలించుకుపోతుంటే ఏనాడైనా అడ్డుకున్నారా? అని సీఎం రేవంత్ నిలదీశారు.