స్వతంత్ర వెబ్ డెస్క్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం రాక సందర్భంగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సీఎంతో పాటు కేకే, సంతోష్ కుమార్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రాకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే మహంకాళి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రేపు రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు, ఫలహార బండ్లపై ఊరేగిస్తారు. బొనాల సందర్భంగా ఆలయంలో 15రోజులు పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బోనాలు, ఓడి బియ్యం సమర్పణతో ఆలయం కిటకిటలాడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.