CM KCR likely to announce good news to farmers of Telangana | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్(KCR)బ్రహ్మాస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. గతంలో రైతుబంధు, దళిత బంధు, గిరిజన బంధులాంటి పథకాలను ప్రకటించిన KCR ఈసారి కొత్త ప్లాన్స్ తో ఎన్నికలను ఎదుర్కొనేందుకు ముందుకు రాబోతున్నారు. 2018 ఎన్నికలకు ముందు రైతుబంధు స్కీమ్ తో ఎలా అయితే అధికారంలోకి వచ్చారో.. అదే రీతిలో ఈసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్నారు. దళిత బంధు పథకంతో ఎన్నికల్లోకి వెళ్లాలనుకున్నా.. అది వర్కవుట్ అయ్యే పరిస్థితి కనపడడం లేదు. అందుకే ఈసారి కూడా మళ్లీ రైతులనే నమ్ముకున్నారు గులాబీ బాస్.
రైతులకు పెన్షన్(Pension) స్కీమ్ ప్రవేశ పెట్టడానికి కసరత్తు దాదాపుగా పూర్తి చేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ప్రకటించిన స్కీంలతో పాటు కొత్తగా రైతులకు పెన్షన్ స్కీమ్ ను అందుబాటులోకి తేవడానికి మేధో మధనం చేస్తోంది సర్కార్. వ్యవసాయ భూమి పట్టా పాస్ బుక్ ఉన్న ప్రతి రైతుకూ పెన్షన్ ఇవ్వాలని KCR నిర్ణయించినట్లుగా సమాచారం. ప్రభుత్వం వద్ద ఉన్న రైతుబందు పథకం లెక్కల ప్రకారం 68 లక్షల రైతుల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి రైతు కుటుంబానికీ పెన్షన్ ఇవ్వాలని యోచిస్తున్నారు కేసీఆర్.
అయితే 2023-24 వార్షిక బడ్జెట్లో ఈ స్కీమ్ ప్రస్తావన లేదు. నిధుల కేటాయింపు లేదు. ఇదివరకు దళిత బంధు పథకం బడ్జెట్లో పెట్టకుండానే ప్రారంభించారు. అంతకు ముందు 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రైతుబంధు స్కీంను అప్పుడు బడ్జెట్లో పెట్టలేదు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ పేరుతో ఉత్తరాదిలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న కేసీఆర్… ఈసారి రాష్ట్రంలో రైతుకు పెన్షన్ స్కీమ్ బాగా ఉపయోగపుడుతుందని అనుకుంటున్నారు.
ప్రపంచంలోనే ఎక్కడాలేని ఈ విశిష్ట పథకాన్ని ప్రారంభిస్తే అన్ని వర్గాల్లో మరోసారి BRS, KCR పేరు రాజకీయ వర్గాల్లో మారుమ్రోగుతుంది అని ఆ పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈ పథకంతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాల గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసి జాతీయ స్థాయిలో లబ్ధి పొందాలనే ఆలోచనలో KCR ఉన్నట్లు తెలుస్తోంది.