స్వతంత్ర వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా పెద కూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో 2023-24 విద్య సంవత్సరానికి జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. అదే ఊరి స్కూల్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులో ముచ్చటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యా కానుక కిట్లను పంపిణీ చేస్తున్నారు. విద్యా కానుక కిట్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇంగ్లోష్-తెలుగులో ముద్రించిన పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా ఇస్తారు. దీంతో పాటు ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6-10 తరగతి పిల్లలకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ, 1-5 తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన విద్యాకానుక కిట్ ను స్కూల్ ప్రారంభమైన తొలిరోజే అందిస్తున్నారు.
జగనన్న విద్యాకానుక కిట్ కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా 4 దశల్లో నాణ్యతా పరీక్షలు నిర్వహించారు. ప్రతి విద్యార్థికీ దాదాపు రూ.2,400ల విలువైన జగనన్న విద్యా కానుక అందుతుంది. ప్రస్తుతం స్కూల్స్ పున: ప్రారంభం రోజే 10 వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్ అందచేసేలా వైసీపీ సర్కార్ ప్రణాళిక రూపొందించింది. కార్పొరేట్ స్కూళ్ళే ప్రభుత్వ బడులతో పోటీపడేలా, విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి బడి ఇంగ్లీషు మీడియంతో సీబీఎస్ఈ సిలబస్ తీసుకువచ్చేందుకు ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తుంది.
విద్యా కానుక ద్వారా పొందిన వస్తువుల్లో ఏమైనా ఇబ్బందులుంటే విద్యార్థులు తమ స్కూల్ హెడ్ మాస్టార్‌కు వాటిని అందిస్తే వారం రోజుల్లో రీప్లేస్ చేస్తారని అధికారులు తెలుపుతున్నారు. అప్పటికి సమస్యల పరిష్కారం కాకపోయినా, లేదంటే మరే ఇతర ఫిర్యాదులున్నా 14417 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేసే సదుపాయాన్ని సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. పాఠశాలల్లో నాడు నేడు మొదటి దశలో 15,715 స్కూల్స్ లో 3,669కోట్లు ఖర్చు చేశామని, నాడు నేడు రెండో దశ 22,344 స్కూల్స్‌లో 8,000.00కోట్లతో పనులు పూర్తి చేశామని, ఇక మూడు దశల్లో రూ. 17,805 కోట్ల వ్యయంతో మొత్తం 45,975 స్కూల్స్‌లో అభివృద్ది పనులు చేపట్టామని ప్రభుత్వం వెల్లడిస్తోంది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ లబ్ధిదారుల సంఖ్య 35,70,675 కాగా అందించిన మొత్తం 6,141.34కోట్లని ప్రకటించారు. 5,18,740 మంది 8 వ తరగతి విద్యార్ధులు, టీచర్లకు 685.87కోట్లతో ట్యాబ్ లు అందించామని చెబుతోంది.