స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి వద్ద క్యూ లైన్‌లో మార్పులు చేసింది. భక్తుల మధ్య తోపులాటలు జరుగకుండా వెండి వాకిలి నుంచి సింగిల్ లైన్ క్యూ లైన్ విధానం అమలు చేసింది. వెండి వాకిలి వద్ద మార్పులతో అత్యధిక సంఖ్యలో భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం రోజున రికార్డు స్థాయిలో 92,238 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 40,400 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 4.02 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్సులో 31 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండగా.. టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు దాదాపుగా 24 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. గత నాలుగు సంవత్సరాల కాలంలో ఆదివారం దర్శించుకున్న భక్తులే అత్యధికం. ఇక కొండపై రద్దీ కొనసాగుతుంది. . ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టీటీడీ రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.