స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దివంగత మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నేపథ్యంలో తన అనంతపురం పర్యటన ముగిసిన వెంటనే.. వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్ధనలు చేశారు జగన్.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా.. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు. ‘ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు.’ అని ఆయన పోస్ట్ చేశారు.