స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా నిజాంపట్నంకు సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. అనంతరం మత్స్యశాఖ ఏర్పాటు చేసిన రా ఫుడ్ స్టాళ్లను పరిశీలించారు. రూ.418 కోట్లతో నిర్మించనున్న బాపట్ల ఫిషింగ్ హార్బర్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. నిజాంపట్నంలో రూ.125 కోట్లతో నిర్మించనున్న దేశంలోనే మొదటి ఆక్వా పార్క్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి కష్టం రానివ్వనని అన్నారు. వైఎస్ఆర్ మత్స్య కార భరోసాలో ఒక్కొక్క కుటుంబానికి యాభై వేల రూపాయలు అందించామన్నారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం మత్స్యకార కుటుంబాలకు ఉపయోగ పడుతుందన్నారు.
వైసీపీ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. చేపల వేట నిషేధ సమయంలో గత ప్రభుత్వాలు మత్స్యకార కుటుంబాలను నిర్లక్ష్యం చేశారు. ముష్టి వేసినట్లు 4 వేలు ఇచ్చేవారు.. గత ప్రభుత్వం ఐదేళ్లలో 104 కోట్లు ఇస్తే వైసీపీ ప్రభుత్వం ఒక సంవత్సరం లోనే 125 కోట్లు ఇచ్చామన్నారు. మత్స్యకార కుటుంబాలలో ప్రమాదం జరిగితే రూ.10 లక్షల నష్ట పరిహారం అందిస్తున్నాం. దేశంలోనే 2వ అతి పెద్ద సముద్ర తీరం ఉన్న మత్స్యకార కుటుంబాల జీవనం అంతంత మాత్రమే. మత్స్యకారుల అభివృద్ధి కోసం రూ.400 కోట్లతో నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేసుకుంటున్నామని అన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం పశ్చిమ గోదావరిలో ఫిషరీస్ యునివర్సటీ నెలకొల్పుతున్నాం.. రూ.185 కోట్లతో దిండి వద్ద ఆక్వా పార్క్ నిర్మాణం చేస్తున్నాం.. రూ.417 కోట్లతో ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నామన్నారు.