తిరుమల లడ్డూ వివాదం జరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఓ ట్వీట్ చేశారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం అని తెలిపారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తిరుమల దర్శనానికి వెళ్ళే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారు.
భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ పుణ్య క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీఎం తెలియజేశారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నాను. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.