చేనేత కార్మికుల ఆరోగ్య భద్రత కోసం బీమా పథకాన్ని వెంటనే అమల్లోకి తెస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనికి 10 కోట్లను విడుదల చేయనున్నట్టు తెలిపారు. చేనేతకు భారంగా మారిన జీఎస్టీని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సాధ్యపడకపోతే కార్మికులు కట్టే జీఎస్టీ మొత్తాన్ని వారికి తిరిగి చెల్లిస్తామన్నారు. ఇందుకు 67 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారన్నారు. త్రిఫ్ట్ ఫండ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమిచ్చే వాటాను 8శాతం నుంచి 16శాతానికి పెంచుతామని, ఇందుకు 10 కోట్లు అందిస్తామని చంద్రబాబు తెలిపారు. కార్మికుల ఆదాయాన్ని పెంచేలా సమగ్ర పాలసీని తీసుకొస్తామన్నారు.
చేనేతలపై వరాల జల్లు కురిపించారు. ఇళ్లలో మగ్గం పెట్టుకునే అవకాశం ఉన్నవారికి అక్కడే పెట్టిస్తామని చంద్రబాబు చెప్పారు. స్థలం అందుబాటులో లేకపోతే ఎక్కడికక్కడ 5 ఎకరాలు తీసుకుని సామూహికంగా మగ్గాలు ఏర్పాటుచేసి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామన్నారు. ఇళ్లు కూడా లేని వారికి కట్టుకోవడానికి వీలుగా ప్రభుత్వమే గృహనిర్మాణ పథకం కింద 4.30 లక్షలు ఇస్తుందని తెలిపారు. చేనేత కార్మికులు మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు దీనికి అదనంగా మరో 50వేలు అందిస్తామని ప్రకటించారు.
చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు.. ఒక్క రూపాయి కూడా భరించకుండా పీఎం సూర్యఘర్ పథకం కింద ఇంటిపైనే సోలార్ పలకలను పెట్టి 200 యూనిట్లు ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాత్రిపూట పనిచేస్తే విద్యుత్తు అందిస్తామని.. పగటిపూట ఉత్పత్తి చేసే విద్యుత్తును శాఖ తీసుకుంటుందని చెప్పారు. అలా 200 యూనిట్ల విద్యుత్తు అందించే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా విజయవాడ పటమటలోని స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను చంద్రబాబు సందర్శించారు. తన సతీమణి నారా భువనేశ్వరి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు చీరలు కొన్నారు. ఉప్పాడ, ధర్మవరం చీరలను కొన్నారు.