దేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. వాడవాడలా రైతుల పండుగను సందడిగా చేసుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ముగ్గులు, గొబ్బెమలు, బసవన్నలు, పతుంగులతో సందడి వాతావరణం నెలకొంది.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఢిల్లీలో సంక్రాంతి పండుగను కలర్‌ఫుల్‌గా జరుపుకున్నారు. ఆయన ఈ సారి ప్రధాని మోదీ, కొంత మంది ప్రముఖులను ఆయన ఇంటికి ఆహ్వానించారు. దీంతో అందరూ కిషన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన మోదీకి కిషన్ రెడ్డి దంపతులు, సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. ఇక ఇదే సమయంలో కళాకారులు తమ ఆట పాటలతో సందడి చేశారు. డప్పులు వాయిస్తూ స్వాగతం పలుకుతున్న కళాకారుల దగ్గరికి మోదీ, చిరంజీవి ఇతరులు చేరుకున్నారు. కళాకారులు డ్యాన్స్ చేయడం ఆపేసి షేక్ హ్యాండ్ తీసుకునేందుకు చేయి చాపారు. ప్రధాన మంత్రి మోదీ వారికి తల వంచి ఎంతో ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం మోదీ పక్కనే ఉన్న చిరంజీవికి కూడా షేక్ హ్యాండ్ కోసం ఓ మహిళ చేయి చాపింది. అయితే చిరంజీవి మాత్రం తల ఊపి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఆ మహిళ కొంత నొచ్చుకున్నట్లుగా కనిపించింది.
ఆ తర్వాత వారంతా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా తులసికోటకు మోదీ పూజలు చేశారు. అనంతరం భోగి మంట వెలిగించారు. గంగిరెద్దులకు ఆహారం అందించి వాటికి, వాటిని ఆడించేవారికి సంప్రదాయ వస్త్రాలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయింది.