తెలంగాణ కుంభమేళా గా పేరొందిన మేడారం మహా జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా మేడారం జాతరకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సీఎం మేడారం వెళ్తారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించు కుంటారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా అమ్మవార్లను దర్శించుకున్నారు.
కేంద్ర మంత్రి అర్జున్‌ముండా కూడా గద్దెల దర్శనానికి రానున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గత సంవత్సరం ఫిబ్రవరిలో పీసీసీ అధ్యక్షుని హోదాలో మేడారం విచ్చేసి తల్లులను దర్శించుకున్నారు. ఇక్కడి నుంచే హాథ్ సే..హాథ్ జోడో యాత్ర ప్రారంభించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రానున్నారు. ప్రముఖుల రాక దృష్ట్యా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అదే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ ఇల వేల్పు సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో మేడారం మురిసిపోయింది. వనదేవతలను దర్శించుకు నేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తొలిరోజు మేడారం ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. జాతరకు తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.