స్వతంత్ర వెబ్ డెస్క్: ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, టీడీపీ కార్యకర్తల అరెస్ట్‌లపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారని మండిపడ్డారు. ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పుంగనూరుకు చెందిన పార్టీ నేతలు కలిశారు. అంగళ్లులో మారణాయుధాలతో దాడులకు యత్నించారని పీలేరు టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఘంటా నరహరి, శ్రీరాం చినబాబులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. పుంగనూరు ఘటనలో 5, అంగళ్లు ఘటనలో 2 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని వివరించారు.
Chandra Babu : పోలీసులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్..!
మారణాయుధాలతో వచ్చారని కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు.టీడీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడంపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ నిర్బంధంలో ఉన్న టీడీపీ నాయకులను కోర్టులో హాజరుపరచకుండా హింసిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలను విచారణ పేరుతో అరెస్టు చేసి కస్టడీలో కార్యకర్తలను హింసిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కారకులైన పోలీసులు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అంతేకాదు అరెస్టు చేసిన వారి నుంచి బలవంతంగా తప్పుడు స్టేట్‌మెంట్లపై సంతకాలు తీసుకుంటున్నారని తెలిసిందని ఇలాంటి చర్యలు పోలీసులకు మంచిది కాదని హితవు పలికారు. పుంగనూరులో రాజకీయ నేతలను సంతృప్తి పరిచేందుకు తప్పులు చేసే ప్రతీ అధికారి తర్వాత కాలంలో సమాధానం చెప్పాల్సి వస్తుందని అన్నారు. అరెస్టైన పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులకు టీడీపీ అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అరెస్ట్ అయిన వారి తరఫున తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
Latest Articles
- Advertisement -