టీడీపీ మూడోజాబితాపై పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ ఏడు లేదా ఎనిమిది స్థానాల అభ్య ర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు జాబితాలను టీడీపీ ప్రకటించింది. 94 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన చంద్రబాబు…. 34 మంది అభ్యర్థులతో రెండో జాబితా ను ప్రకటించారు. రాష్ట్రంలో 175 సీట్లు ఉండగా, పొత్తులో భాగంగా టీడీపీకి 144 స్థానాల్లో పోటీ చేస్తోంది. బీజేపీకి 10, జనసేనకు 21 సీట్లు కేటాయించారు. రెండు జాబితాలు కలిపి ఇప్పటి వరకు మొత్తం 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు మూడో జాబితాపై కసర్తతు చేస్తున్నారు. దాంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
టీడీపీలోని కీలక నేతలు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేతలు, పార్టీకి అత్యంత విధేయులుగా పేరున్న కొంతమంది పేర్లు రెండో జాబితాలోనూ కనిపించకపోవడంత ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ రెండో జాబితాలోనూ అనూహ్యంగా మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు పేరు లేదు. ఈయనను చంద్రబాబు చీపురుపల్లి వెళ్లమంటే… ఈయన మాత్రం విశాఖ వదిలి వెళ్లనని పట్టుబట్టి కుర్చున్నారని తెలుస్తుంది. దీంతో… రెండో జాబితాలోనూ పేరు లేకపోవడంతో… గంటా నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో మరో సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి పేరూ ఈ లిస్ట్ లో కనిపించలేదు. వీరితోపాటు మాజీమంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేఎస్ జవహార్, దేవినేని ఉమల పేర్లు కూడా కనిపించకపోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. వీరితోపాటు ఆలపాటి రాజా, కొమ్మాలపాటి శ్రీధర్ లకూ చుక్కెదురవ్వడంతో టీడీపీలో ఏమి జరుగుతుందనే చర్చ తెరపైకి వచ్చింది. వీరిలో మైలవరం టిక్కెట్ ఈసారికి వసంత కృష్ణప్రసాద్ కి ఇచ్చే అవకాశం ఉందని, దేవినేనికి రెస్ట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న వేళ… ఆయన పేరు కూడా లేకపోవడం ఉత్కంఠగా మారింది. గుంటూరుజిల్లా పెదకూరపాడు నుంచి మూడు సార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన కొమ్మాలపాటి శ్రీధర్ పేరు ఈదఫా కూడా వినిపించలేదు. ఈసారి కూరపాడు టిక్కెట్ ను భాష్యం ప్రవీణ్ కు కేటాయించారు చంద్రబాబు. దీంతో ఈసారి ఈయనకు రెస్ట్ అనే చర్చ తెరపైకి వచ్చింది. మరి ఈ సీనియర్లకు చంద్రబాబు ఇప్పటికే సమాచారం అందించారా.. లేక, మూడో లిస్ట్ వరకూ వేచి చూసే పరిస్థితి ఉంటుందా అనేది సస్పెన్స్ గా మారింది.
శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థితోపాటు ఆమదాలవలస, టెక్కలి, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఆశావహులంతా రెండో జాబితా కోసం ఎదురు చూశారు. కాగా.. గురువారం చంద్రబాబునాయుడు రెండో జాబితా ప్రకటించగా.. అందులో కేవ లం నరసన్నపేట నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని ఖరారు చేశారు. శ్రీకా కుళం, ఎచ్చెర్ల, పలాస, పాతపట్నం నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఆ నలుగురు అభ్యర్థులు ఎవరన్నది చర్చనీయాంశ మవు తోంది. తమకు టికెట్ దక్కుతుందో లేదోనని ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.


