స్వతంత్ర వెబ్ డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైల్లోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై కుటుంబసభ్యులు, టిడిపి శ్రేణుల ఆందోళనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. స్కిల్ డెవలప్ మెంట్ తో పాటు అనేక పనుల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని.. అందువల్లే ఆయనను దర్యాప్తు సంస్థ సిఐడి అరెస్ట్ చేసిందన్నారు. చంద్రబాబుపై ఎవరికీ రాజకీయ కక్ష లేదని.. అక్రమంగా ఇరికించలేదని అన్నారు. చంద్రబాబు ను ఆయన కుటుంబసభ్యులే బట్టలిప్పి బయట నిలబెడుతున్నారని సజ్జల అన్నారు. అయితే చంద్రబాబును కక్షతోనే అరెస్ట్ చేసారని.. జైల్లో వున్న ఆయనతో అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని టిడిపి ప్రచారం చేస్తోందన్నారు. ఈ విషయంలో చంద్రబాబు కుటుంబం, టీడీపీ కాస్త సక్సెస్ అయినట్లు కనిపిస్తోందని సజ్జల అన్నారు. సంపాదించడం కోసమే సీఎం అయినట్లు చంద్రబాబు వ్యవహరించారని.. చివరకు టిడిపి అధినేతగా కూడా కుంభకోణాలకు పాల్పడ్డారని అన్నారు. ఇప్పుడు ఆయన అవినీతి బాగోతాన్ని బయటపెడుతుంటే దానిపై చర్చ లేకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు టిడిపి ప్రయత్నిస్తోందని సజ్జల అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో రూ.240 కోట్లను చంద్రబాబు షెల్ కంపనీల ద్వారా దోచుకున్నాడని సజ్జల ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పాత్ర నేరుగా ఉందని ఆధారాలతో సహా బయటపడిందన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ వస్తే అంతా బయట పడుతుందన్నారు.