అభివృద్ధి, సంక్షేమ పథకాలతో వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేశారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయంలో నిలిచిపోయిన పథకాలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా చంద్రబాబు కానుక, అన్నా క్యాంటీన్లు వంటి వాటిపై దృష్టి సారించారు.
చంద్రబాబు కానుకతో ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు ఇచ్చే కానుకను మళ్లీ అదించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో రేషన్‌కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా అందనున్నాయి. అయితే,..ఈ పథకానికి ఏడాదికి 538 కోట్లు చొప్పున ప్రభుత్వంపై ఐదేళ్లకు 2 వేల 690 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రాథమిక అంచనా. గత టీడీపీ హయాంలో 2014-2019 మధ్య చంద్రన్న కానుకను అందజేసింది ఏపీ సర్కార్. సంక్రాంతి కానుక కింద ప్రతి కిట్‌లో కిలో గోధుమ పిండి, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, అరకిలో కందిపప్పు, అరలీటరు పామాయిల్, 100 మిల్లీ గ్రాముల నెయ్యిని కార్డుదారులకు అందించారు. అలాగే క్రిస్మిస్ కానుక కింది వీటినే అందించారు. రంజాన్ తోఫా కింద ముస్లింలకు 5 కిలోల గోధుమపిండి, కిలో వర్మిసెల్లి, 2 కిలోల చక్కెర, 100 మిల్లీగ్రాముల నెయ్యితో తోఫా కిట్లను ఉచితంగా అందజేశారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ పథకాలను జగన్ సర్కార్ నిలిపివేయడంతో.. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తిరిగి చంద్రబాబు కానుకలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పేదలు సంతోషంగా పండగలు జరుపుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక చంద్రన్న కానుకలతోపాటు కొత్త రేషన్‌కార్డులు, నిత్యావసర సరుకుల పంపిణీపై కూడా కీలక నిర్ఱయాలు తీసుకుంది కూటమి సర్కార్. కందిపప్పు, పంచదార, గోధుమలు ఇలా అన్నిటినీ తీసివేసి కేవలం బియ్యం పంపిణీ మాత్రమే జరగుతుండటంతో తిరిగి.. ప్రతి నెలా బియ్యంతోపాటు సబ్సిడీ ధరలపై పంచదార, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. దీంతో బియ్యంతోపాటు చక్కెర, కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు వంటి తృణధాన్యాలు కూడా రేషన్‌కార్డుదారులకు అందనున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రేషన్‌కార్డులను కూడా జారీ చేయనుంది. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటుగా.. ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
ఇంతేకాదు చంద్రబాబు హయాంలో సాగిన పథకాలన్నీ మళ్లీ అమలు చేసే క్రమంలోనే అన్నా క్యాంటీన్లను కూడా ప్రారంభించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్యాంటీన్లు కూడా జగన్ సర్కార్ అధికారంలోకి రావడంతో నిలిచిపోయాయి. వైసీపీ హయాంలో అన్నా క్యాంటీన్ల వ్యవహారం పెద్ద రాజకీయ దుమారం రేపింది. పలు చోట్లు క్యాంటీన్ల కూల్చివేతతో పొలిటికల్ వైరం నడిచింది. చంద్రబాబుపై కుట్రతో జగన్ పేదోడి కడుపుకొట్టారంటూ రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు గుప్పించారు. ఇక చంద్రబాబు అధికారం చేపట్టగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌తో తన మార్క్ చూపించారు ముఖ్యమంత్రి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జులై 1వ తేదీనే 90శాతానికంటే అధికంగా.. పెంచిన పెన్షన్‌తో కలిపి ఒకేసారి 7 వేల రూపాయలు అందజేశారు. ఇలా ఓవైపు జగన్‌ను టార్గెట్ చేస్తూనే అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దూసుకుపోతున్నారు సీఎం చంద్రబాబు. గత సర్కార్ నిలిపివేసిన పథకాలపై దృష్టిసారించిన చంద్రన్న కానుకలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.