శీష్ మహల్….ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బాగా వార్తల్లోకి వచ్చిన పేరు ఇది. శీష్ మహల్ అంటే…ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పటి అధికారిక నివాసం. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శీష్ మహల్ ను పునరుద్ధరించారు. దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సిక్స్ ఫ్లాగ్ స్టాఫ్ బంగ్లా పునరుద్దరణకు అప్పటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలు వచ్చాయి. కాగా ఈ ఆరోపణలపై కేంద్ర ప్రజా పనుల విభాగం ప్రాథమిక విచారణ జరిపి ఒక నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో శీష్ మహల్ పునరుద్దరణకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై విచారణకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది .
ఇదిలా ఉంటే, కేజ్రీవాల్ ముఖ్మమంత్రిగా ఉండగా, తన అధికారిక నివాసానికి పొరుగున ఉన్న నాలుగు ప్రభుత్వ ఆస్తులను చట్టవిరుద్ధంగా విలీనం చేసి, శీష్ మహల్ ను విస్తరించారని బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా ఆరోపించారు. అంతేకాదు ఈ ప్రభుత్వ ఆస్తుల విలీనాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆయన ఒక లేఖ కూడా రాశారు. అలాగే ఢిల్లీ లో బీజేపీ సర్కార్ ఏర్పాటయ్యాక, కొత్త ముఖ్యమంత్రి శీష్ మహల్ లో ఉండరని వీరేంద్ర సచ్‌దేవా స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో శీష్ మహల్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల విలాసాలకు శీష్ మహల్ ఒక ఉదాహరణ అని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లింది భారతీయ జనతా పార్టీ. అంతేకాదు సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా కేజ్రీవాల్ ను ఉద్దేశించి శీష్ మహల్ వివాదాన్ని ప్రస్తావించారు.
కాగా ఇటీవలి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి శీష్ మహల్ వివాదం కూడా ఒక కారణమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో విమర్శలకు తావు ఇవ్వకుండా ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా పేరున్న శీష్ మహల్ కు దూరంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఈనెల 19న ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను కమలం పార్టీ దాటింది. మొత్తం 70 నియోజకవర్గాలున్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ 48 సెగ్మెంట్లు గెలుచుకుంది. దశాబ్దకాలం పాటు అధికారంలో కొనసాగిన ఆమ్ ఆద్మీ పార్టీని 22 సీట్లకే పరిమితం చేసింది. ఈనెల ఎనిమిదో తేదీననే ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే ఇప్పటివరకు కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది తెలియరాలేదు.
కాగా ముఖ్యమంత్రి ఎంపిక కోసం భారతీయ జనతా పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా 17 లేదా 18న బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగుతుంది. అలాగే ముఖ్యమంత్రి పదవికి నేతను ఎంపిక చేయడానికి 15 మంది పేర్లతో ఒక షార్ట్ లిస్ట్ ను బీజేపీ నాయకులు తయారు చేశారు. ఈ జాబితాను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముందు ఉంచుతారు. ఎవరి ప్లస్ పాయింట్లు ఏమిటి అనే దానిపై సుదీర్ఘ చర్చ జరుగుతుంది. ఆ తరువాత వడపోత కార్యక్రమం ఉంటుంది. అంతిమంగా కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ప్రధాని నరేంద్ర మోడీ ఖరారు చేసే అవకాశాలున్నాయి.
కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ , మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవల్ ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాజా ఎన్నికల్లో న్యూఢిల్లీ సెగ్మెంట్ నుంచి పర్వేష్ వర్మ పోటీ చేసి గెలుపొందారు. కాగా పర్వేష్ వర్మ కుటుంబానికి బీజేపీతో అనుబంధం ఉంది. పర్వేష్ వర్మ తండ్రి సాహెబ్ సింగ్ వర్మ గతంలో బీజేపీ తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతేకాదు ఉత్తర భారతదేశంలో రాజకీయంగా బలమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత పర్వేష్ వర్మ. అలాగే సతీశ్ ఉపాధ్యాయ, విజయేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మ వంటి పలువురి పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అలాగే పూర్వాంచ్ నేపథ్యం ఉన్న వారికి ఈసారి ప్రాధాన్యం ఇస్తారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అలాగే ఈసారి ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రిని ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేస్తారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.