స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మక్తల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం తెలియజేశారు. దయాకర్ రెడ్డి మృతి వార్త తనను ఎంతో బాధకు గురిచేసిందని తెలిపారు. టీడీపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దయాకర్.. కొద్దికాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ నేడు ప్రాణాలు విడవడం బాధాకారమని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. మరోవైపు ఇవాళ సాయంత్రం మక్తల్‌లో జరగనున్న దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో బాబు పాల్గొననున్నారు.
అటు హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. దయాకర్ రెడ్డి కుటుంబంతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని, వారు తనకు మంచి మిత్రులని తెలిపారు. ఆత్మీయుని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దయాకర్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు.
దయాకర్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అని అన్నారు. ఒక మంచి ప్రజా నాయకుడు దయాకర్ రెడ్డి మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు అని రేవంత్ అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండి జనంకోసం పోరాడే నేత దయాకర్ రెడ్డి అని కొనియాడారు. దయాకర్ రెడ్డి కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.