ఏసీబీ, ఈడీ సంస్థల ప్రశ్నలు ఒకేలా ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని.. ఏం అడిగినా సమాధానం చెబుతానని అన్నారు. లేని అవినీతిపై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎంక్వైరీ చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నందుకే.. తనపై కూడా కేసులు పెట్టారని ఆరోపించారు. తనపై పెట్టే ఖర్చుతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయొచ్చని సూచించారు.
“రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇస్తున్నా.. ఈడీ ముందైనా ఏసీబీ ముందైనా కూర్చుందాం. లైవ్ టీవీ పెట్టి నేను, రేవంత్ రెడ్డి ఇద్దరం కూర్చుంటాం. ఇద్దరికీ లై డిటెక్టర్ పరీక్షపెట్టండి. భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ..ఏ తప్పు చేయకపోయినా అధికారులను, విచారణను గౌరవించి ఈడీ ముందు విచారణకు హాజరయ్యా”.. అని కేటీఆర్ అన్నారు.
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించింది ఈడీ. సుమారు 7 గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించారు. ప్రధానంగా హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంపై ఈడీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.
విదేశీ సంస్థకు 45.7 కోట్ల రూపాయల బదిలీ అంశంపై వివిధ కోణాల్లో ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాదు.. ఈ కేసులో ఇప్పటికే అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేసు కేసులో నిబంధనల ఉల్లంఘనలపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా.. ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగానే కేటీఆర్‌ను సుదీర్ఘంగా విచారణ చేశారు అధికారులు.
అంతకుముందు.. ఫార్ములా ఈ కార్ రేసు విచారణ కోసం కేటీఆర్ ఈడీ ఆఫీసుకు వస్తున్న సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. విచారణ జరిగే ఈడీ ఆఫీసు వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేసి గులాబీ పార్టీ కార్యకర్తలను వెనక్కు పంపేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, కారు పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో వారిని పోలీసు వాహనాల్లో తరలించారు.