కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సహకార బ్యాంకులో ఇటీవల జరిగిన నియామకాలు, చివరకు కేరళలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ , సీపీఎం మధ్య రాజకీయ యుద్దానికి ఈ పరిణామాలు తెరలేపాయి. ఈ పరిణామాలలో భాగంగా తాజాగా కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఐసీ బాలకృష్ణన్‌తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కోశాధికారి ఎన్‌ఎమ్ విజయన్ అలాగే ఆయన కుమారుడు జిజేష్ లను ఆత్మహత్యలకు పురికొల్పారన్న ఆరోపణలపై బాలకృష్ణన్‌తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు పెట్టారు. విజయన్, ఆయన కుమారుడు జిజేష్‌లు కిందటేడాది డిసెంబర్ 27న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయన్ ఆత్మహత్య నోట్ రాశారు. ఈ నోట్‌లో ఎమ్మెల్యే ఐసీ బాలకృష్ణన్‌తో పాటు మరికొన్ని పేర్లు ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. వీటిలో వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్టీ అప్పచ్చన్ పేరు కూడా ఉండటం విశేషం.
విజయన్ అలాగే ఆయన కుమారుడు జిజేష్ లకు ఒక నేపథ్యం ఉంది. సుల్తాన్‌బతేరీలో కాంగ్రెస్ నియంత్రణలో ఉన్న ఒక సహకార బ్యాంకులో ఇటీవల కొన్ని నియామకాలు జరిగాయి. ఈ నియామకాల కోసం ఎమ్మెల్యే బాలకృష్ణన్ లంచం తీసుకున్నారని విజయన్ కుటుంబం విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది.
వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కోశాధికారి ఎన్‌ఎం విజయన్ సూసైడ్ నోట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఐసీ బాలకృష్ణన్ పేరు ఉంది. సుల్తాన్ బతేరిలోని కాంగ్రెస్ నియంత్రణలో ఉన్న సహకార బ్యాంకులో నియామకాల కోసం ఎమ్మెల్యే బాలకృష్ణన్ లంచం తీసుకున్నారని విజయన్ కుటుంబం విడుదల చేసిన ఆత్మహత్యా నోట్ పేర్కొంది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో సహకార బ్యాంక్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తుదారుడి తండ్రి నుంచి ఎమ్మెల్యే ఐసీ బాలకృష్ణన్ 30 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్లు ఒక డాక్యుమెంట్ బయటపడింది. ఈ డాక్యుమెంట్ పై ఎన్‌ఎమ్ విజయన్ సంతకం ఉంది. ఈ నాలుగు పేజీలో సూసైడ్ నోట్‌లో ఆర్థికంగా తాను పడ్డ కష్టాలను విజయన్ పేర్కొన్నారు.
కో ఆపరేటివ్ బ్యాంకులో నియామకాల పేరుతో పలువురు వ్యక్తుల నుంచి ఎమ్మెల్యే ఐసీ బాలకృష్ణన్ డబ్బు వసూలు చేశారని సూసైడ్ నోట్‌లో విజయన్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి రాసిన లేఖలోనూ విజయన్ పేర్కొన్నారు. అయితే తాను చెప్పినదాన్ని ఎవరూ పట్టించుకోలేదని విజయన్ పేర్కొన్నారు. ఈనేపథ్యంలో అన్ని దారులు మూసుకుపోయాయన్న మనోవేదనతో తాను ఆత్మ హత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు తన కుమారుడు జిజేష్ ను ఉద్యోగం నుంచి తొలగించారని వెల్లడించారు.ఈ అక్రమాల గురించి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్‌కు కూడా తెలుసునని సూసైడ్ నోట్ లో విజయన్ పేర్కొన్నారు.
విజయన్ , ఆయన కుమారుడు జిజేష్ ఆత్మహత్యలు రాజకీయరంగు పులుముకుంది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఐసీ బాలకృష్ణన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ వచ్చింది. అయితే కేరళ కాంగ్రెస్, బాలకృష్ణన్ కు మద్దతుగా నిలిచింది. ఇదిలా ఉంటే కేరళ పీసీసీ అధ్యక్షుడికి విజయన్ రాసిన లేఖ బయటపడటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే బాలకృష్ణన్‌తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి సహకార బ్యాంకు నియామకాలు కేరళలో ప్రస్తుతం హాట్‌టాపిక్ గా మారాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికారం లో ఉన్న సీపీఎం అంటోంది. అయితే వామపక్ష ప్రభుత్వం తమ ఎమ్మెల్యే పై తప్పుడు కేసు పెట్టిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.