ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాగ్ నివేదిక కాక పుట్టిస్తోంది. లిక్కర్ పాలసీపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తాజాగా లీక్ అయినట్టు తెలుస్తోంది. లీకైన వివరాల మేరకు… లిక్కర్ పాలసీలో అవకతవకల కారణంగా ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ పేర్కొంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం మరోసారి తెరమీదకు వచ్చింది. మద్యం అమ్మకాలకు సంబంధించి 2021 నవంబరు 17న ఒక కొత్త పాలసీ తీసుకువచ్చింది అప్పటి కేజ్రీవాల్ ప్రభుత్వం. అయితే 2022 సెప్టెంబరు చివరకు సదరు మద్యం పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కాగా మద్యం అమ్మకాలకు సంబంధించి కేజ్రీవాల్ తీసుకున్న కొత్త పాలసీ వల్ల ఢిల్లీ ఖజానాకు రూ. 2, 026 కోట్ల మేర నష్టం జరిగినట్లు తెలిసింది. సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ …కాగ్, ఇందుకు సంబంధించి రూపొందించిన నివేదిక లీక్ అయినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.
కాగ్ నివేదిక ప్రకారం, ఢిల్లీ మద్యం పాలసీ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైంది. అంతేకాదు మద్యం పాలసీకి సంబంధించి నిపుణుల కమిటీ చేసిన అనేక సిఫార్సులను అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నాయకత్వంలోని మంత్రుల బృందం విస్మరించిందని కాగ్ నివేదిక వెల్లడించింది. అలాగే మద్యం పాలసీపై కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో మంత్రి మండలి, లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కూడా తీసుకోలేదన్నది కాగ్ నివేదిక సారాంశం. మద్యం పాలసీకి సంబంధించిన వ్యవహారంలో అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ, అన్ని సంస్థలను వేలం వేయడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతించిందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది. అలాగే నష్టాల్లో ఉన్న కంపెనీలకు కూడా లైసెన్సులు పునరుద్ధరించినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక పేర్కొంది.
కాగా మద్యం కుంభకోణానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా తో పాటు మరికొంతమంది ఆప్ నేతలు అరెస్టయ్యారు. అయితే కిందటేడాది బెయిల్ పై కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తరువాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కేజ్రవాల్. లిక్కర్ స్కామ్ పై కాగ్ నివేదిక వెలుగు చూసిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ పై బీజేపీ సీనియర్ నేత అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.
ఇదిలాఉంటే , కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పేరుతో ప్రస్తుతం మీడియాలో సర్క్యులేట్ అవుతోంది నకిలీ నివేదిక అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎదురు దాడి చేసింది. ఫిబ్రవరి లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది కోసమే కాగ్ పేరుతో బీజేపీ ఒక నకిలీ నివేదికను మీడియాకు విడుదల చేసిందని ఆప్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో నకిలీ కాగ్ నివేదికను రూపొందించారని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు.
కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి ఐదో తేదీన ఢిల్లీలో పోలింగ్ జరుగుతుంది. పోలింగ్‌నకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అధికార పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ మధ్య దాదాపు ప్రతిరోజూ మాటల యుద్ధం నడుస్తోంది. రాజకీయంగా ఎత్తులు, పై ఎత్తులు వేయడంలో రెండు పార్టీలు ప్రస్తుతం బిజీగా ఉన్నాయి.