పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి సహా పలువురు వేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. 4 వారాలలోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు చేసింది. గడువులోపు నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా విచారిస్తామని న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
కోర్టు తీర్పు వెలువడమే ఆలస్యం.. బీఆర్‌ఎస్, గులాబీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ తీర్పును స్వాగతిస్తున్నామంటూ తమ స్పందన తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత.. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టు అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యమని…త్వరలోనే ఉప ఎన్నికలు రావడం ఖాయమంటూ రాసుకొచ్చారు. అలాగే ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నేతలు గెలవడం తథ్యమంటూ జోష్యం చెప్పారు. ఇక ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టే విధంగా హైకోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. రాష్ట్ర శాసనసభాపతి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని ఆశిస్తున్నామన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై హైకోర్టు ఆదేశాలు హర్షణీయమని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. హైకోర్టు ఆదేశాలతో స్పీకర్ నిర్ణయం తీసుకుని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్నారు. మూడు నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలు ఖాయమన్న ఆయన.. హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని స్పీకర్‌కు ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.
బీఆర్‌ఎస్ నేతలకు కౌంటర్ షురూ చేశారు కాంగ్రెస్ లీడర్లు. ఈ క్రమంలోనే కేసీఆర్ పేరును ప్రభుత్వం బదనాం చేస్తుందనడంలో ఎలాంటి అర్థం లేదని అన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. అన్నీ చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. అన్ని శాఖలో తాము చెప్పిందే వేదం కదా అని అన్నారు. ఇప్పుడు విచారణలో పేరు రాగానే కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారన్న ఆయన… బీఆర్ఎస్ హయాంలో మంత్రులు చేసింది ఏముందని ఆయన నిలదీశారు. విచారణ ముందుకు సాగకుండా చేసే పని చేయొద్దని సూచనలు చేశారు.. ప్రజలకు వాస్తవాలు తెలియాలని విచారణకు ఆదేశించామని… ఎవరినో నిందితులుగా చేయడానికి కాదని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు.
హైకోర్టు తీర్పుపై స్పందించిన కడియం శ్రీనివాస్ హైకోర్టు తీర్పును అధ్యయం చేయాల్సిన అవసముందని.. అవసరమైతే హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు. హైకోర్టు తీర్పు వెలవడగానే బీఆర్ఎస్ నాయకులు ఏదో సాధించామనుకుని సంతోషపడుతూ ప్రకటనలు చేస్తున్నారని,.. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదని కడియం మండిపడ్డారు.