వరంగల్: BRS ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(MLA Rajaiah), జానకీపురం సర్పంచ్ నవ్య ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తనపై లైంగిక ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్యకు ఎమ్మెల్యే రాజయ్య క్షమాపణలు చెప్పారు. పార్టీ పెద్దల ఒత్తిడితో సర్పంచ్ ఇంటికి వెళ్లిన రాజయ్య.. వారితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. తెలిసి తెలియక తప్పు చేస్తే క్షమించాలని.. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నా అన్నారు. తాను తప్పుచేశానని భావిస్తే మహిళలందరూ క్షమించాలని కోరారు. విభేదాలు పక్కనబెట్టి అందరం కలిసి పనిచేయాలని అధిష్టానం సూచించిందని చెబుతూ నవ్యకు రాజయ్య క్షమాపణలు చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నవ్య.. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు. చిన్నపిల్లలపై కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయని.. మహిళలపై అరాచకాలను ప్రశ్నించాలన్నారు. ఏ స్థాయిలో ఉన్నా మహిళలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. మహిళలను వేధించే వెధవలు ఇప్పటికైనా మారాలని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.