ఒక్క కులం, మతం కోసం బీఆర్ఎస్ పార్టీ ఫుట్టలేదని.. దేశంలో మార్పు కోసం పుట్టిన పార్టీ అని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్వంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఎందరో మహనీయులు జన్మించిన మహారాష్ట్ర గడ్డలో తాగేందుకు నీళ్లు లేకపోవడం బాధాకరమన్నారు. గోదావరి, కృష్ణా నదులతో పాటు దేశ ఆర్థిక రాజధాని అయిన మహారాష్ట్రలో నీటి సమస్యలెందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ఎందరి ప్రధానులు వచ్చినా దేశ ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సాగు, తాగు నీరుతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశంలోని పేదలు మరింత పేదరికంలో కురుకుపోతుంటే.. సంపన్నులు మాత్రం మరింత సంపన్నులు అవుతున్నారని మండిపడ్డారు. దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందని.. ఎంత త్వరగా మేల్కొంటే అంత తర్వగా బాగుపడుతామన్నారు. దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదని వెల్లడించారు. మీ సమస్యల పరిష్కారం కావాలంటే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలని కేసీఆర్ కోరారు.


