తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించిందా..? ఈ మేరకు పార్టీ వర్గాలకు అధినేత కేసీఆర్ సూచించారా..? అంటే అవుననే అంటున్నారు గులాబీ నేతలు. అంతేకాదు.. పార్టీ తరఫున పోటీ చేయకపోయినా ఎవ్వరికీ పరోక్షంగానూ మద్దతు ఇవ్వరాదని నిర్ణయించారు. ఓవైపు వరుస ఓటముల వేళ గులాబీ బాస్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు..? దీనిపైనే ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.
ఒక రకంగా చెప్పాలంటే మండలి ఎన్నికలకు దూరంగా ఉండాలని గులాబీ పార్టీ నిర్ణయించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో పోటీ చేద్దామంటూ నేతలు ప్రతిపాదించినా గులాబీ బాస్ మాత్రం సంబంధిత ప్రతిపాదనను తిరస్కరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో రెండు ఉపాధ్యాయ స్థానాలు కాగా.. ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం. వీటికి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే.. ఈ ఎన్నికల్లో కారు పార్టీ పోటీ చేస్తుందని నేతలు అంతా భావించారు. ఆశావహులు సైతం తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ, గులాబీ బాస్ మాత్రం పోటీకి ససేమీరా అనడంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిజానికి రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు జరుగుతున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య బాగానే ఉంది. దీంతో.. ఇక్కడ జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయన్న వాదనను విన్పిస్తున్నారు పార్టీ నేతలు. కానీ, గులాబీ పార్టీ అధినేత నిర్ణయం మాత్రం మరోలా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంతేకాదు.. పట్టభద్రుల కోటాలో పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్న నేతలకు సమాచారం ఇవ్వాల్సిందిగా కీలక నేతలకు సూచించారు గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. ఈ తరుణంలోనే కేసీఆర్ నిర్ణయానికి కారణం ఏంటన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
పార్టీ అగ్రనేతల మధ్య అంతర్గతంగా జరుగుతున్న చర్చల ప్రకారం శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయడం, లేదంటే ఎవరికో పరోక్షంగా మద్దతు ఇవ్వడం వద్దని కేసీఆర్ చెప్పడానికి కారణం స్థానిక సంస్థల ఎన్నికలేనన్న టాక్ విన్పిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో గులాబీ కేడర్ నిస్తేజంగా మారిందన్న వాదన విన్పించింది. కానీ, లగచర్ల సహా ఇతర ఘటనలతో రేవంత్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు.
ఇవన్నీ ప్రతిబింబించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలే సరైన వేదికని భావిస్తున్నారు గులాబీ బాస్. దీంతో.. ఇప్పటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దం కావాలని ముఖ్యనేతలకు సూచించారట కేసీఆర్. ఫిబ్రవరి నెలాఖరులో భారీగా బహిరంగ సభ నిర్వహించడంతోపాటు త్వరలోనే ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించాలని యోచిస్తున్నారట కేసీఆర్. మరి..గులాబీ బాస్ ప్లాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్కవుటయ్యేనా.. ? ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో విన్పిస్తోంది.