మాజీ మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నారు. లాయర్‌తో కలిసి వచ్చారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను విచారించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారని అన్నారు. చట్టాలను గౌరవించి, రాజ్యాంగంపై ఉన్న నమ్మకంతోనే విచారణకు వచ్చానని చెప్పారు. తనను ఏసీబీ విచారణకు పిలిచి తన ఇంటిపై రెయిడ్స్ చేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. నా ఇంట్లో వాళ్లే ఏదో ఒకటి పెట్టి కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారన్నారు.
రైతు భరోసా నుంచి డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు ఆడుతున్నారు. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే ఏసీబీ విచారణకు వచ్చా. లాయర్‌ను అనుమతిస్తేనే విచారణకు వస్తా. నరేందర్ రెడ్డి విషయంలో కుట్ర చేశారు. పోలీసులు దొంగ స్టేట్‌మెంట్ సృష్టించారు. నరేందర్ రెడ్డికి జరిగిందే నాకూ జరుగుతుంది. హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉండగా ఈ డ్రామాలు ఎందుకు. రేవంత్ రెడ్డి ఇచ్చిన పత్రాలను నా ఇంట్లో పెట్టి.. నన్ను ఇరికించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఫార్ములా ఈ వ్యవహారంలో మంత్రిగా నిర్ణయం తీసుకున్నా. సమాచారం అంతా ఏసీబీ దగ్గరే ఉంది. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. నేను చెప్పనిది చెప్పినట్టు రాసుకోవడానికే లాయర్‌ను వద్దంటున్నారు. అడ్వకేట్‌ను అనుమతించకపోతే వెనక్కి వెళ్లిపోతా. డ్రామాలతో డైవర్షన్ తప్ప మరొకటి లేదు. 420 హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వంతో కొట్లాడతాం… అని కేటీఆర్ అన్నారు.