అమెరికా అధ్యక్షుడిగా ఇటీవలే ప్రమాణం స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన రోజే .. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కు ను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. దీనిపై అమెరికాలో సియాటిల్ ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రద్దు ఆదేశాలను న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యంగ విరుద్ధమని పేర్కొన్నారు.
జనవరి 20న యూఎస్ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశారు. పారిస్ ఒప్పందంతో పాటు డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్ హిల్‌పై దాడిచేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం, వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వ రద్దు నిర్ణయం.. వంటి ఉత్తర్వులు ఉన్నాయి.
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించిన లేదా దేశ వ్యక్తులందరూ అమెరికా లేదా వారు నివసించే రాష్ట్ర పౌరులుగా గుర్తించబడతారు. దీని అర్థం అమెరికాలో జన్మించిన ఎవరైనా పౌరుడిగా పరిగణించబడతారు.
అయితే, ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు ఈ సవరణకు భిన్నంగా ఉంది. “యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం హక్కు దానంతట అదే యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించిన వ్యక్తులకు వర్తించదు” అని పేర్కొంది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం.. డాక్యుమెంటేషన్ లేని తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఆటోమేటిక్‌గా జనన పౌరసత్వాన్ని పొందలేరని చెబుతోంది.
ట్రంప్ ఉత్తర్వు ఎవరికి వర్తిస్తుంది?
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉత్తర్వు నుంచి 30 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 19 తర్వాత నుంచి అమెరికాలో పుట్టిన పిల్లలకు ఇది కొత్త సవరణ వర్తిస్తుంది. ట్రంప్ ఆదేశం అమలులోకి వస్తే ఏటా 1.5 లక్షలకు పైగా పిల్లలకు పౌరసత్వం నిరాకరించబడుతుందని డెమొక్రాటిక్ నేతృత్వంలోని రాష్ట్రాలు నివేదించాయని రాయిటర్స్ తెలిపింది.
భారతీయులపై ఎలాంటి ప్రభావం?
అమెరికా పౌరసత్వం పొందడానికి మార్గంగా ఉపయోగించే జన్మతః పౌరసత్వం రద్దు భారతీయ కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ట్రంప్ ఆదేశం అమల్లోకి వస్తే.. ఎన్‌ఆర్‌ఐ పిల్లలు అమెరికాలో ఉండేందుకు వేరే మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది. దాదాపు 5.2 మిలియన్ల మంది భారత సంతతికి చెందిన ప్రజలు అమెరికాలో నివసిస్తున్నారు. అమెరికాలో భారతీయ అమెరికన్లు రెండో అతిపెద్ద వలసదారుల గ్రూప్‌గా ఉన్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గత ఏడాది ప్రచురించిన మరో నివేదిక ప్రకారం 2022 నాటికి అమెరికాలో 2.2 లక్షల మంది అనధికార భారతీయ వలసదారులు నివసిస్తున్నారని అంచనా వేసింది. ఇది 2018లో 4.8 లక్షలలో సగం కంటే తక్కువ.