21.7 C
Hyderabad
Saturday, February 8, 2025
spot_img

భోగి మంటలు

కష్టజీవుల కన్నుల పండువ, అన్నదాతల పంటల పండువ, ప్రజలందరి పెద్ద పండువ మకర సంక్రాంతి పండగ. భోగీ, కనుమల నడుమ పెద్దగా నిలిచే పెద్ద పండుగకు గతించిన పెద్దల స్మరణ పండగగాను పేరుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిగా నిర్వహించుకునే ఈ పంటల పండుగను తమిళనాడు ప్రజలు పొంగల్ గా ఇదే రోజున నిర్వహించుకోగా, కేరళవాసులు వేరే నెలలో పంటల పండుగను ఓనంగా చేసుకుంటారు. సూర్యారాధన ప్రధానంగా జరిగే ఈ పండుగ ఎన్నో రీతుల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. తెలుగునాట సంక్రాంతి అంటే..ఎన్నో వేడుకలు కన్పిస్తాయి. గొబ్బెమ్మలు, రంగవల్లులు, హరిదాసులు, కోడి పందేలు, పొట్టేళ్ల పందేలు, ఎడ్ల పందేలు, డూ డూ బసవన్న విన్యాసాలు, పగటి వేషగాళ్లు, ప్రభల తీర్థాలు..ఇలా ఎన్నో ఎన్నెన్నో మకర సంక్రాంతి పండువలో దర్శనమిస్తాయి.

అసలు సిసలు పెద్ద పండుగ, పెద్దల ఆరాధనా పండుగ సంక్రాంతి పండువ. నూతన క్రాంతి వెలుగు జిలుగులతో శోభిల్లే సరదా, సంబరాల పండగే సంక్రాంతి పండువ. సాధారణంగా సంక్రాంతి మూడు రోజుల పండువగా కీర్తింపబడుతున్నా…పూర్వం అయిదు రోజుల పెద్ద పండువగా సంక్రాంతిని నిర్వహించుకునే వారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, బొమ్మల కొలువు అనే అయిదు రోజుల పండువల సమాహారమే మకర సంక్రాంతి అని పెద్దలు చెబుతారు.

అన్నప్రదాత, ఆరోగ్య ప్రదాత, సర్వ ప్రదాత సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా అభివర్ణిస్తారు. సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో ప్రవేశిస్తాడు. ఇలా పన్నెండు రాశుల్లో సూర్యప్రవేశాన్ని…ఆయా రాశి సంక్రమణంగా పిలుస్తారు. అయితే, మకర రాశిలో భానుడు ప్రవేశించే పవిత్ర కాలాన్నే మకర సంక్రాంతిగా చెబుతాము. మకర సంక్రాంతిని మహా పర్వదినంగా హైందవ జాతి భావిస్తుంది. ఎందుకంటే.. ఈ రోజునుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. దేవతల ఏక దిన కాలం జీవుల ఏడాది కాలంతో సమానమని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. దేవతల పగటిపూట కాలాన్ని ఉత్తరాయణంగా, వారి రాత్రిపూట కాలాన్ని దక్షిణాయనంగా పెద్దలు తెలియజేస్తున్నారు. వెలుగు సంకేతమైన ఉత్తరాయణంలో ప్రతి రోజు, ప్రతి ఘడియ పుణ్యప్రదమే. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు.

దేవతలకు రాత్రి అయినంత మాత్రాన ఆరు నెలల దక్షిణాయనాన్ని పాపకాలంగా భావించరు. దక్షిణాయనంలో ఎన్నో పవిత్ర పర్వదినాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు చాతుర్మాస దీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ పర్వదినంతో పాటు శివ, కేశవులకు ప్రీతి పాత్రమైన కార్తీకం, గోదాదేవి తిరుప్పావై దీక్షలు చేపట్టే ధనుర్మాసం, గీతా జయంతి, హనుమత్ వ్రతం, దత్తాత్రేయ స్వామి జయంతి.. ఇవన్నీ దక్షిణాయనంలో వస్తాయి. మహా పవిత్ర పర్వదినం, ఉత్తర ద్వార దర్శన మహంతమైన రోజు ముక్కోటి ఏకాదశి ఈ ఆయనంలోనే వస్తుంది. అయితే, అగ్రతాంబూలం అందుకుంటున్న ఉత్తరాయణం పెద్ద పండువ సంక్రాంతి నుంచి మొదలవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాల ఘడియల కోసం భీష్ముడు తన ప్రాణాన్ని అప్పటి వరకు నిలమెట్టుకున్నాడని భారతగాథ తెలియజేస్తోంది. దక్షిణాయనం సంపూర్ణమై ఉత్తరాయణం ప్రారంభానికి కొంచెం ముందు భోగి పండువనాడు గోదాదేవి, రంగనాథస్వామి కళ్యాణ వేడుక నిర్వహించడం, తిరుప్పావై పాశురాల ఘట్టం సమాప్తం అవ్వడం జరుగుతుంది.

డిసెంబర్ మాస నడుమలో సంక్రాంతి నెలపట్టు మొదలవుతుంది. ధనుర్మాసం సందర్భంగా దేవాలయాల్లో ప్రభాత సమయంలో దేవదేవుని అవతారాలు, అమ్మవార్ల అవతారాలను ప్రదర్శిస్తారు. పడతులు ప్రాతః సమయంలో గృహాల ఎదుటు రంగు రంగుల ముగ్గులు వేస్తారు. వేకువ జామునే హరిలో రంగ హరి అంటూ హరిదాసులు దర్శనమిస్తారు. పాతను సాగనంపి, కొత్తకు ఆహ్వానం పల్కడం..చీడ, పీడలు తొలగాలని ప్రార్థనలు చేస్తూ సంక్రాంతి తొలిరోజైన భోగి నాడు భోగి మంటలు వేసుకుంటారు. భోగి పండుగ నాడు సాయంత్రం వేళ చిన్నారులకు రేగు పండ్లతో భోగి పండ్లు పోసి… ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు.

పెద్ద పండుగనాడు వేకువ జామునే లేచి నువ్వుల పిండి, శనగపిండితో శరీరానికి నలుగు పెట్టి తలారా అభ్యంగన స్నానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్దికి ఈ ప్రభాత అభ్యంగన స్నానం ఎంతో దోహదపడుతుందని పెద్దలు చెబుతారు. సంక్రాంతి పర్వదినాన అందరి ఇళ్లల్లో దైవ పూజలు, నూతన వస్త్రధారణ, పిండి వంటలు, విందు భోజనాలు కనిపిస్తాయి. పిండి వంటల్లో మిఠాయిలు, అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పరమాన్నం, చక్రపొంగలి, కట్టుపొంగలి, పులిహోర, గారెలు.. తదితర ఎన్నో వంటకాలు ఉంటాయి. సరదా కబుర్లు, సరస హాస్య సంభాషణలు, మృష్టాన్న భోజనాలతో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటారు.

సంక్రాంతి పర్వదినాల్లో సంప్రదాయ క్రీడలుగా కొడి పందేలు, పొట్టేళ్ల పందేలు, ఎడ్ల పందేలను నిర్వహిస్తారు. సంక్రాంతి కోడి పందేలు అంటే ఆషామాషీగా ఉండవు. ఎన్నో ప్రత్యేక జాగ్రత్తలతో కొళ్లకు బలవర్ధకర ఆహారాన్ని అందించి, ఏడాది పొడవునా కోళ్లను అపురూపంగా చూసుకుని ప్రత్యేక శిక్షణ ఇచ్చి, పందెం కోళ్లను బరిలోకి దింపుతారు. కోట్ల కు కోట్ల రూపాయలు, ఎకరాలకు ఎకరాలు పందేలు వేసుకుంటారు. కోడి పందేల్లో విజయాలతో ఎందరో కుబేరులుగా మారినవారు ఉన్నారు. ధనవంతులు బికారులుగా మారిన ఘటనలు ఉన్నాయి.

ఉత్తరాయణంలో కాలం చేసిన వారికి ఉత్తమ గతులు సిద్ధిస్తాయని, స్వర్గ ప్రాప్తి సిద్ధిస్తుందని హైందవ జాతి విశ్వాసం. సంక్రాంతి పెద్ద పండుగగానే కాకుండా గతించిన పెద్దల పండువగాను తెలుగు ప్రజలు నిర్వహించుకుంటారు. సంక్రాంతి పర్వదినం నాడు గతించిన పెద్దలను స్మరణ చేసుకుంటూ ఎన్నో రీతుల్లో విప్రులకు దానాలు చేస్తారు. ఇందులో కూష్మాండ దానం అంటే గుమ్మడి కాయ దానాన్ని ప్రముఖంగా చెబుతారు.

సంక్రాంతి నాడు పిత్రుదేవతలకు తప్పక తర్పణాలు వదలాలని పురాణ ప్రముఖులు, పౌరోహిత్య పెద్దలు చెబుతున్నారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణలు ఇవ్వాలని అయితే, ఏ కారణాలవల్లయినా మిగిలిన సంక్రమణాల్లో తర్పణాలు ఇవ్వలేకపోతే.. మకర సంక్రాంతి నాడు ఇచ్చే పుణ్య ఫలం దానిని భర్తీ చేస్తుందని అంటున్నారు. అందుకే మకర సంక్రాంతి రోజున తర్పణాలు తప్పక ఇవ్వాలని అంటున్నారు. ఈ పర్వదినాన పేదలకు పెద్ద ఎత్తున సంతర్పణలు చేయడం కొన్నిచోట్ల కనిపిస్తుంది.

పాడి పంటల పండువ సంక్రాంతి వేడుకల్లో కనుమ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కనుమ నాడు రైతులు పశువులను అందంగా అలంకరించి, పుష్కలంగా గ్రాసం అందజేసి మూగజీవాలపై ప్రేమాభిమానాలు చూపిస్తారు. మాంసహారం తినే రోజుగా కనుమకు పేరుంది. శాఖాహారులు మాంసాహారం తినలేనందున .. మాంసకృతులున్న మినుముతో పిండివంటలు చేసుకుని ఆరగిస్తారు. అందుకే కనుము నాడు మినుమ తినాలనే సామ్యం వచ్చింది. కనుమనాడు మినుముతో గారెలు, ఆవడలు చేసుకుని శాఖాహారులు భుజిస్తారు.

ఉత్తరాయణ పుణ్యకాలంలోనే భీష్మాచార్యుడు తనువు చాలించాడని భారత గాథ చెబుతుండగా, ఆది శంకరాచార్యులవారు ఈ పవిత్ర కాలంలోనే సన్యాసదీక్ష స్వీకరించారని పురాణ చరిత్రలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు చేతిలో అసురగణం అంతమైన రోజుగా, నూతన క్రాంతితో భక్తులు భక్తి శ్రద్ధలతో దైవారాధన చేసిన రోజుగా కొందరు సంక్రాంతిని కీర్తిస్తారు. భారతదేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనేకాక కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిషా, పంజాబ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో మకర సంక్రమణ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటారు.

Latest Articles

ఆడపిల్లలూ.. బూచోళ్లున్నారు జాగ్రత్త..!

మనుషుల మధ్య మృగాలు తిరుగుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నారులు, మైనర్లు అని కూడా చూడకుండా తెగబడుతున్నాయి. మనిషి తోలు కప్పుకుని మృగంలా ఆడవాళ్ల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్