రారాజు పండువగా పేరొందిన మకర సంక్రమణాన్ని ప్రధానంగా మూడు రోజుల పండగగా చేసుకుంటారు. సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు. త్రిమూర్తులు మాదిరి త్రి పర్వదినాల సమాహారంగా పెద్ద పండువ సంక్రాంతి వస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ.. ఈ మూడు పెద్ద పండువలు..వరుస రోజుల్లో వచ్చినా..దేని విశిష్టత అది కలిగి ఉంటుంది. భోగ భాగ్యాలు అందించే భోగి పండువ వైభవాన్ని ఇప్పుడు చూద్దాం.
హైందవ సంప్రదాయంలో పండువలకు ఉన్న ప్రాభవం అంతా ఇంతా కాదు. సాధారణంగా ప్రతి పండువలో చెడ్డపై మంచి గెలుపు కనిపిస్తుంది. అయితే, పెద్ద పండువగా పేరొందిన మూడు రోజుల మకర సంక్రాంతి పండువలో ఎన్నో విశిష్టతలు కన్పిస్తాయి. అందుకే.. సినీ కవి.. ఏటేటా వచ్చి సంక్రాంతి పండువ బీద సాదల ప్రియమైన పండువ, కష్టజీవుల కన్నుల పండువ, రైతన్నల పంటల పండువ అన్నారు. ముచ్చటగా చేసుకునే మూడు రోజుల పెద్ద పండుగలో.. ముందుగా విచ్చేసేది భోగి పండగ.
క్యాలెండర్ లో పాత సంవత్సరం కనుమరుగవుతూ కొత్త సంవత్సరానికి ఎలా ఆహ్వానం పలుకుతుందో, దక్షిణాయనం సెలవు తీసుకుంటూ ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతుంది. దక్షిణాయనం నిష్క్రమణ, ఉత్తరాయణ ప్రవేశానికి మధ్యలోని సంధికాలంలో భోగి పండువ వస్తుంది. దక్షిణాయనంలో సూర్యగమనం భూమికి దూరం అవ్వడం వల్ల చలి తీవ్రతరం అవుతుంది. అయితే, దక్షిణాయనం, ఉత్తరాయణం మధ్య ఉండే సంధికాలంలో.. చలి తీవ్రత మరీ అధికంగా ఉంటుందని.. ఈ సంధికాల రోజే భోగి. అమిత చలిని అదుపు చేసుకునేందుకు భోగి పండుగ నాడు ప్రభాత సమయంలో భోగి మంటలు వేస్తారు. చలి గజ గజలను మంట భగ భగలతో తరిమికొట్టే రోజు కనుక దీనికి భోగి అనే పేరు వచ్చింది. భోగి నాడు వేసే మంటలను భోగి మంటలు అంటారు.
పాడి పంటలతో తులతూగే గ్రామసీమలు దేశానికి పట్టుగొమ్మలు. దేశ సౌభాగ్యం గ్రామసీమలపైనే ఆధార పడి ఉంది. పంటలకు, పల్లెసీమలకు అవినాభావం సంబంధం ఉంది. అందుకే, పంటల పండువ సంక్రాంతి వచ్చిందంటే పల్లెలన్నీ గ్రామీణ సంప్రదాయాలతో తళతళలాడుతాయి. పల్లెసీమల్లో విరివిగా లభ్యమైయ్యే తాటి ఆకులతో భోగి మంటలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకే భోగి పండుగ వచ్చిందంటే చాలాలచోట్ల ఎండిన తాటాకుమోపులు దర్శనమిస్తాయి.
చీడ, పీడలు సమసిపోవడానికి, పాత సామగ్రిని సాగనంపడానికి సిద్దమైన జనాలు, భోగి ముందు రోజు పాత వస్తువులు, ఎండిన తాటాకులు, కట్టెలను సిద్దం చేసుకుంటారు. తూరుపు తెలతెలవారుతుండగా భోగినాడు భోగి మంటలు వేసి వీటన్నింటినీ అగ్నికి ఆహుతి చేస్తారు. ప్రతి ఇంటిలో భోగి మంటలు వేసుకుంటారు. అయితే, ఏ ఇంటిలోనైనా భోగి మంట వేసుకోవడం కుదరకపోతే, ఏ మాత్రం చింతించాల్సిన పని ఉండదు. ఎందుకంటే ఏ ఊరిలోనైనా నాలుగు రోడ్ల ప్రధాన కూడళ్లలో తప్పకుండా భోగి మంట వేయడం జరుగుతుంది.
చలి నుంచి కాపాడే భోగి మంటల్లో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతోంది కదూ..! గొబ్బెమ్మలను పిడకలుగా మార్చి భోగి మంటల్లో వేస్తారు. గోమయంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. పిడకలు భోగి మంటల్లో వేయడం వల్ల ఔషధగాలులు వీస్తాయి, బాక్టీరియా నశిస్తుంది, ఆరోగ్యకర వాతావరణం ఏర్పడుతుంది.
సత్య, ధర్మ , భక్తి మార్గాల్లో ఆనందంలో తేలియాడడాన్ని భోగం అంటారు. ఆ భోగానుభవాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉండవచ్చు. ఈ తరహా భోగం వల్లే యోగం సిద్ధిస్తుందని, అందుకే యోగులే నిజమైన భోగులని అంటారు. ఆండాళ్ తిరువణ గళే…అంటూ గోదామాతను భక్తులు పూజిస్తారు. ధనుర్మాసం ఆరంభం నుంచి భోగి పండువ వరకు ఆలయాల్లో, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో తిరుప్పావై పాశురాల పఠనం జరుగుతుంది.
ఆళ్వార్ ల కథనాల ప్రకారం శ్రీ మహావిష్ణువు భోగి రోజున భువికి దిగివచ్చి.. గోదామాత ధనుర్మాసవ్రతానికి మెచ్చి ఆశీర్వాదాలు అందజేశాడు. ఈ కారణంగానే, భోగి నాడు వేకువజామున నిద్ర లేచి కల్లాపి చల్లి రంగవల్లుల మధ్య గొబ్బెమ్మలను పెట్టి పూజలు చేసేవారికి ఇహ, పర సౌక్యాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. సరిగ్గా భోగి నాడు ధనుర్మాసం పూర్తవ్వడంతో, పాశుర పఠనం సంపూర్ణం అవుతుంది. భోగి రోజునే వైష్ణవ దేవాలయాల్లో గోదాదేవి, రంగనాథస్వాముల కళ్యాణమహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు.
ప్రతి పండువలో జరిగే మాదిరి అభ్యంగస్నానాలు, నూతన వస్త్రధారణలు, దైవ పూజలు, పిండి వంటలు, విందు వినోదాలు, మృష్టాన్న భోజనాలు, సరస సంభాషణలు.. అన్ని భోగి పండువలో ఉంటాయి. అయితే, భోగి మంటలు, గొబ్బెమ్మలు, రంగవల్లులు, భోగిపళ్లు, బోనాబికావిళ్లు.. తదితర ఎన్నో వేడుకలు.. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహరాల ప్రకారం జరుగుతాయి. ధనస్సు పూజలు, నెలపట్టి ప్రారంభం నుంచి నారీమణులు అందమైన ముగ్గులు పెట్టడడంలో నిమగ్నం అవుతారు. అయితే, భోగి పండుగ నాడు వేసే ముగ్గులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.
పెద్ద పండువ పర్వదినాలు పూర్తయ్యే దశలో ముగ్గుల పండువ ముగింపు దశకు చేరుకుటుంది. ఒక ఇంటినుంచి మరో ఇంటికి కలిపే రథం ముగ్గుతో ఈ వేడుక ముగుస్తుంది. అయితే, భోగి నాడు భోగి మంటలు వేసే ప్రాంతంలో ముగ్గు పెట్టడం ఆచారం. చాలామంది ఈ ఆచారాన్ని పాటిస్తారు. భోగి మంట ప్రదేశంలో సామగ్రి, పాత వస్తువుల భస్మీపటలమైన ప్రాంతంలో కసువును తీసివేసి.. కడిగి సుందరంగా ముగ్గులు వేస్తారు.
భోగి మంటలు, భోగి పండ్ల గురించి అందరికీ తెలుసు, మరి భోగి పులక గురించి కొందరికే తెలిసివుంటుంది. ఇది అన్నదాతలకు సంబంధించిన వేడుక. భోగి నాడు సాగుభూమికి నీరు పారించి సిరుల పొంగేలా దీవించాలని భూమాతకు ప్రార్థనలు చేస్తారు. చక్కని పంట ఇచ్చిన చల్లని భూమాత, తదుపరి పంటకు ఏ ఆటంకాలు లేకుండా దీవించాలని కోరుతూ సాగునీటి పొలంలో పారించడాన్ని పులకేతగా పిలుస్తారు. ప్రతి ఏటా ఆనవాయితీగా సాగించే ఈ వేడుకను భోగి పులకగా పిలుస్తారు.
భోగి మాలక్ష్మికి కోటి దండాలు అంటూ భక్తులు భోగి నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కీర్తిస్తూ భక్తులు పాటలు పాడతారు. భోగి పండువ సాయంత్రం వేళ అయిదేళ్లులోపు చిన్నారులకు భోగి పండ్లు పోస్తారు. నవ నవలాడుతూ ఉండే రేగు పండ్లు మంచి రంగు, రుచితో మెరిసిపోతాయి. రేగు పళ్లను, చిల్లర పైసలను పిల్లల తలపై నుంచి పోసి భోగి పండ్ల వేడుకను పెద్దలు ఘనంగా నిర్వహిస్తారు. భోగి పండ్ల ఆశీర్వాదాన్ని దైవ ఆశీర్వాదంగా ప్రజలు భావిస్తారు. భోగి పండ్లు పోయించుకున్న పిల్లలను… సకల భువన సంరక్షకుడు, దేవాది దేవుడు, దేవతా సార్వభౌముడు, అఖిలాండ కోటి నాయకుడైన శ్రీ మహావిష్ణువే సర్వదా రక్షిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.
భోగ భాగ్యాలు కలుగచేసే భోగినాడు సంక్రాంతి సంబరాలకు సంబంధించిన అన్ని వేడుకలు అట్టహాసంగా, ముమ్మరంగా జరుగుతాయి. భోగి మంటలతో పాటు, కోడి పందేలు, ఎడ్ల పందేలు, గాలి పటాలు, గంగిరెద్దు విన్యాసాలు, బుడ బుక్కలాటలు, పగటి వేషగాళ్ల గానాలు, బొమ్మల కొలువులు ఇలా ఎన్నెన్నో సంబరాలు అంబరాన్నంటేలా ఈ వేడుకల్లో దర్శనమిస్తాయి.