మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత అధికం కానున్నాయి. మండే ఎండలతో పాటు వడగాలులు తప్పవంటోంది వాతావరణ శాఖ. ఇప్పటికే 36 నుండి 38 డిగ్రీల మధ్య నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఈ నెలాఖరు నాటికి 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. వాతావరణంలో వచ్చిన మార్పులే ఎండ తీవ్రత పెరగడానికి కారణంగా చెప్తున్నారు. మార్చినెలలో మహారాష్ట్ర, బిహార్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనే గతంలో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్ధితులు మారాయి. ఈ సారి ఆ మూడు రాష్ట్రాలతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్ధాన్, గుజరాత్ తదితర 9 రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటే సూచనలు కన్పిస్తున్నాయి. ఇదే విషయాన్ని అమెరికా శాస్త్రవేత్తల బృందం క్లైమేట్ సెంట్రల్ వెల్లడించింది. 1970 నుంచి దేశంలో మార్చి, ఏప్రిల్ నెలల ఉష్ణోగ్రతలను విశ్లేషిస్తే దేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణంలో వస్తోన్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఉత్తరాది రాష్ట్రాల్లో శీతాకాలంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 1970తో పోలిస్తే జమ్మూ కాశ్మీర్‌లో 2.8, మిజోరంలో 1.9 డిగ్రీలు సగటు ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువగా ఉంటున్నాయి. దేశంలోని 51 నగరాల్లో మార్చి చివరి వారంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరే అవకాశాలున్నట్లు అమెరికా శాస్త్రవేత్తల బృందం తెలి పింది. మార్చి నెలలో వడగాలులు రావడానికి గ్లోబల్ వార్మింగ్ పరిస్ధితులే కారణంగా చెబుతున్నారు. వేసవి కాలంలో వస్తున్న ఇలాంటి మార్పులు, ఎదురౌతున్న పరిస్ధితులనుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే అందుకు సన్నద్ధం కావాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితోపాటు వేడుక్కుతున్న వాతావరణంను చల్లబ ర్చుకునేలా పచ్చదనం పెంచుకోవాలి. పరిశ్రమలు, వాహనాలు నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించుకోవాలి. లేదంటే భానుడి భగభగలకు తలవంచాల్సిందే.


