తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హీట్ పెరుగుతోంది. రాష్ట్రంలోని 17పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో పాగావేసేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు షురూ చేసింది. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. ప్రచారంలోనూ దూకుడు పెంచేందుకు సన్న ద్ధమవుతోంది. ఈ క్రమంలో నేటి నుంచి వరుసగా పార్లమెంట్ స్థాయిలో బూత్ అధ్యక్షుల సమ్మేళ నాలు నిర్వహించనున్నారు. నేటి నుంచి ఐదు రోజుల్లో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమ్మేళనాలు పూర్తికి కమల నాథులు ప్లాన్ చేశారు.
ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్ సమ్మేళనం, రేపు భువనగిరి పార్లమెంట్ లో బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహిం చనున్నారు. రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ సమ్మేళనాలు జరగనున్నాయి. ఈనెల 12న వరంగల్, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో, 13వ తేదీన అదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల్లో. 14వ తేదీన పెద్ద పల్లి, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో, 15వ తేదీన నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ లో బూత్ అధ్యక్షుల సమ్మేళనాన్ని కమల నాథులు పూర్తి చేశారు. బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయిలో నేతలతో సమావేశాల్లో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది.
మరోవైపు ఈనెల 11, 12, 13 తేదీల్లో మండల స్థాయి మీటింగ్ లు, 15, 16, 17 తేదీల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. 17వ తేదీన లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో.. 20వ తేదీ తరువాత పార్టీ జాతీయ స్థాయి నేతలు భారీ స్థాయిలో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో మూకుమ్మడిగా ప్రచారం చేసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ప్లాన్ చేస్తుంది. దేశంలో ఎన్నికలు పూర్తయిన ప్రాంతాల నుంచి ముఖ్యనేతలు తెలంగా ణలో ప్రచారానికి రానున్నారు. మొత్తానికి 20వ తేదీ తరువాత రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది.


