తెలంగాణలో బీజేపీ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. మండల, జిల్లా కమిటీల ఎన్నికల ప్రక్రియ దిశగా వేగంగా అడుగులేస్తోంది. నేడు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ సంస్థాగత సమావేశం జరిగింది. దీనికి రాష్ట్రంలోని బీజేపీ జిల్లాల అధ్యక్షులు, రిటర్నింగ్ అధికారులు, జోనల్ పరిశీలకులు, జిల్లా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జులు, ఎన్నికల అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో సంస్థాగత ఎన్నికలు, తాజా రాజకీయాలు, భవిష్యత్ కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఇప్పటికే సంస్థాగతంగా బూత్ కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకున్న బీజేపీ సంక్రాంతి వరకు మండల, జిల్లా అధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేసేందుకు సిద్ధమైంది. సంక్రాంతి తర్వాత బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ జరుగనుంది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 10లోగా మండల కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని, ఆ తర్వాత జిల్లా కమిటీల ఎన్నికలు కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్ నాయకులకు పిలుపునిచ్చారు.
ఈనెల 28లోగా క్రియాశీల సభ్యత్వం, పోలింగ్ బూత్ కమిటీల ఎన్నికలు పూర్తి కావాలని సునీల్ బన్సల్ తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల సభ్యత్వం, 30 వేల క్రియాశీల సభ్యత్వం జరిగిందన్నారు. మండల, పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటుకు సంబంధించి, పార్టీ నిబంధనల ప్రకారం పరిశీలకులు, రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తయిందని చెప్పారు.