స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ గడ్డపై అడుగుపెట్టారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులను నిర్మించి, ఎప్పటి నుంచో మనం కలలుగన్న రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేసిన ఈరోజు ఉత్తర తెలంగాణకు శుభసూచకమని చెప్పారు. బీజేపీతోనే తెలంగాణకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని అన్నారు. తెలంగాణకు భరోసాగా ఉన్నామని చెప్పేందుకే ప్రధాని వచ్చారన్నారు. ‘‘ కేసీఆర్‌ను గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నారు. హామీలు ఇచ్చి ప్రజల కళ్లలో మట్టికొట్టిన కేసీఆర్‌ను ఓడించాలి. బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్ మాటలు చెప్పారు. బంగారు తెలంగాణ చేతల్లో చేసి చూపించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ఈటల తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని కొన్ని పేపర్లు, ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని… బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే లోపాయకారీగా పని చేస్తున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం మూడు సంవత్సరాలుగా కొనసాగుతోందని చెప్పారు.
ప్రపంచమే బాస్‌గా గుర్తించిన నేత ప్రధాని నరేంద్ర మోదీ’ అని తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ‘‘ ప్రపంచ దేశాలే పాదాభివందనం చేసే నేత మోదీ. రూ.6 వేలకోట్ల పనులు ప్రారంభించిన మోదీకి కరీంనగర్ ప్రజల తరఫున ధన్యవాదాలు. ఏం ముఖం పెట్టుకొని ప్రధాని మోదీ వస్తారని కొందరు ప్రశ్నించారు. 10 వేల మంది వరకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకొని మోదీ వచ్చారు. వరంగల్‌ను స్మార్ట్ సిటీ చేసేందుకు మోదీ వచ్చారు. ప్రధాని కార్యక్రమానికి వచ్చేందుకు కేసీఆర్‌కు ముఖం లేదు. మోదీ వస్తే కేసీఆర్‌కు కొవిడ్ వస్తుంది.. జ్వరం వస్తుంది’’ అని బండి సంజయ్ విమర్శించారు. పార్టీ తనకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సహా అనేక అవకాశాలు కల్పించిందని ఆయన అన్నారు.