స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టును అడ్డుకుంటున్న ఆ అజ్ఞాత వ్యక్తి సీఎం జగన్ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. ఈ కేసులో అవినాశ్ అరెస్ట్ కాకుండా ఆపడం ఎవరి తరం కాదని తేల్చిచెప్పారు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుండా బీజేపీ అడ్డుపడుతోందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టంచేశారు. సీబీఐ వ్యూహాత్మకంగానే అరెస్ట్ ఆలస్యం చేస్తోందన్నారు.
సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థకు స్థానిక పోలీసులు సహకరించపోవడం మంచి పద్ధతి కాదన్నారు. కోడికత్తి తరహాలోనే అవినాశ్ రెడ్డి ఆసుపత్రి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాగే ఈ నాలుగేళ్లలో సీఎం జగన్ నయవంచక పాలన అందించారని విమర్శించారు. జగన్ రాక్షస పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు. ఎన్నికలకు ఒకటి, రెండు నెలల ముందు పొత్తులపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు.