భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభ ముంబైలో జరిగింది. లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమి నేతలు బలప్రదర్శనకు వేదికగా నిలిచింది. ముంబైలోని శివాజీ పార్కులో ఈ సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, స్టాలిన్, ఫరూఖ్ అబ్దుల్లా వంటి నేతలు హాజరయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో విపక్ష ఇండియా కూటమి సమరానికి సిద్ధమైంది. దేశంలో అధికార మార్పే ప్రధాన ఎన్నికల నినాదంగా నేడు ముంబయిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఎన్డీఏ కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఐక్యంగా పనిచేయాలని సంకల్పించింది.
కేంద్రంలోని బీజేపీ పై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తోందన్నారు. ఈడీలాంటి సంస్థలను అడ్డుపెట్టుకొని తమ పార్టీ నేతలను బీజేపీలో చేర్చుకున్నారని ఆరోపించారు. తనను కూడా ఈడీ వేధించిందని ఆరోపించారు.