33.9 C
Hyderabad
Thursday, March 5, 2026
spot_img

తెలంగాణలో సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీ

     తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి…? అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నమేర రాణించలేకపోయిన ఆ పార్టీ… లోక్‌సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటుతుందా..? మోదీ చరిష్మాను వాడుకుని ఈ సారైనా రెండంకెల ఎంపీ స్థానాలను దక్కించు కుంటుందా..? పార్టీ చేపడుతున్న రథయాత్రలు ఏ మేరకు ఉపయోగపడతాయి..? బీఆర్‌ఎస్‌ తో పొత్తు ఊహాగానాలు నిజమవుతాయా..? ఒకవేళ అదే జరిగితే కమలదళానికి లాభమా..? నష్టమా..?

       తెలంగాణలో ఈ సారి ఎలాగైనా పాగా వేసి తీరుతాం. గత రెండు ఎన్నికల నుంచి స్థానిక బీజేపీ నేతలు ఘనంగా చెబుతున్న మాట ఇది. కానీ ఇప్పటికీ ఈ స్వప్నం సాకారం కాలేదు. కనీసం లక్ష్యానికి దరిదాపుల్లోకి కూడా రాలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగానే పోట్లాడినా కమలనాథులకు దక్కింది కేవలం ఒకటంటే ఒకటే సీటు. సరే ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో రెండు సీట్లు సాధించారనుకోండి. అప్పట్లో రాష్ట్ర స్థాయిలో బీజేపీ అంత బలంగా లేదు.. పైగా తెలంగాణ తెచ్చిన క్రెడిట్‌తో టీఆర్ఎస్ ఎన్నికల్లోకి వెళ్లింది కాబట్టి వార్‌ వన్‌సైడ్ అయింది అనుకుందాం… కానీ 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 17 ఎంపీ స్థానాల్లో కేవలం నాలుగింట గెలి చింది. వాటిలో మూడు కూడా ఉత్తర తెలంగాణలోనే. అక్కడ ముందునుంచి పార్టీ బలంగానే ఉంది కాబట్టి ఆ మాత్రం విజయాలు దక్కాయి. ఇక ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాషాయదళం హోరాహోరీగానే పోరాడింది. ప్రధానమంత్రి మోదీ సహా అతిరథ మహా రథులంతా రాష్ట్రంలో అనేక దఫాలుగా పర్యటించి… సుడిగాలి ప్రచారం నిర్వహించారు. క్యాడర్‌ కూడా మునుపటి కన్నా హుషారుగా సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. అయినా చెప్పుకోదగిన సీట్లు మాత్రం సాధించలేకపోయింది. కేవలం 8 స్థానాల్లోనే గెలిచింది. ఈ సారి కూడా గెలిచిన సీట్లన్నీ
ఉత్తర తెలంగాణలోనివే.

     త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సైతం తెలంగాణ బీజేపీ గట్టిగానే ప్రిపేర్‌ అవుతోంది. రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లు గా  విభజించి.. అన్ని లోక్‌సభ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ రథయాత్రలు చేపడుతోంది. అనేక చోట్ల ఈ యాత్ర లకు ప్రజల నుంచి మంచి స్పందనే వస్తోంది. అయితే ఈ స్పందన ఓట్ల రూపంలోకి మారుతుందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు పార్టీ అగ్ర నేతల మధ్య ఉన్న పొరపొచ్చాలు కూడా ఈ ఆందోళనకు ప్రధాన కారణమ వుతోంది. ఈ అభిప్రాయభేదాల కారణంగానే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ చాలా సీట్లు కోల్పోవాల్సి వచ్చిందన్నది… కింది నుంచి పై వరకు అందరి అభిప్రాయం. అయితే కేంద్రంలో మోదీ సర్కారుకు అనుకూల పవనాలు ఉండడం… తెలంగాణలో బీజేపీ గతం కన్నా బలపడడం… ఈ సారి ఎన్నికలకు అనుకూల పరిణామాలుగా చెప్ప వచ్చు. ఈ జోష్‌ను వాడుకుని ఈ సారి కచ్చితంగా పదికి పైగా ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని కమలనాథులు గట్టి ప్రయత్నం చేస్తున్నారు

       మరోవైపు బీఆర్ఎస్‌తో పొత్తు ఊహాగానాలు తెలంగాణ బీజేపీ నాయకులకు కాస్త ఇబ్బందికరంగా మారాయి. కేంద్ర స్థాయిలో ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నా… రాష్ట్ర నాయకత్వం మాత్రం గులాబీ దళంతో దోస్తీకి ససేమిరా అంటోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు బయటపడడం… కాంగ్రెస్‌ సర్కారు బీఆర్ఎస్‌ అవినీతిపై గట్టిగా పోరాటం చేస్తుండడంతో… ఈ తరుణంలో గులాబీ పార్టీతో జట్టు కడితే మొదటికే మోసం వస్తుందని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే రథయాత్రల్లో ఎక్కడ ఈ ప్రస్తావన వచ్చినా.. అలాంటిదేమీ లేదంటూ గట్టిగా తేల్చి చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు వద్దు అనేది కమలనాథుల భావన. ఒకవేళ అధిష్టానం గనక జాతీయ ప్రయోజనాల మేరకు కేసీఆర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నా.. క్షేత్రస్థాయిలో తమ పార్టీకి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు రాష్ట్ర నేతలు. అందుకే చాలా ముందస్తుగానే రథయాత్రలం టూ ప్రజల్లోకి దూసుకెళ్లారు. మరి కాషాయదళం అప్రమత్తత ఏ మేరకు ఫలితాలిస్తుందన్నది వేచి చూడాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్