కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రియాంక గాంధీపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. భూముల అవకతవకల్లో ఆమె హస్తం ఉందని ఆరోపించారు పార్టీ సీనియర్ నేత ప్రదీప్ బండారి. అసలు ప్రియాంక గాంధీకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. భూములు ఎలా సంపాదించారని అడిగారు.
రాహుల్ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ లోక్‌సభా స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రియాంకగాంధీ తన ఆస్తుల్ని ప్రకటించారు. మొత్తం 12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో 4 కోట్ల 27 లక్షలు చరాస్తులుగా పొందుపరిచారు. తన భర్త రాబర్ట్ వాద్రా ద్వారా బహుమతిగా 4 వేల 400 గ్రాముల విలువైన బంగారం లభించినట్లు తెలిపారు.
మెహ్రౌలీ ప్రాంతంలోని వ్యవసాయ భూమిలో రెండు సగం వాటాలు, అందులో ఉన్న ఫామ్‌హౌస్ భవనంలో సగం వాటా ఉన్నట్లు తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు ప్రియాంక. వీటి విలువ రెండు కోట్లని వెల్లడించారు. హిమాచల్‌ప్రదేశ్, సిమ్లాలోనూ ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు ప్రియాంక. దీనిపైనే బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది.