తెలంగాణలో కులాల కొట్లాట పంచాయతీ ఇంకా నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే రోజురోజుకూ పెరుగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాని మోదీ కులం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.
రాహుల్ గాంధీ తాత ముస్లిం అయినప్పుడు రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ ముస్లిం అవుతారని.. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ కూడా ముస్లిమేనని చెప్పారు. తండ్రి మతమే కుమారుడికి వస్తుందని చెబుతున్నారని.. అదే విషయాన్ని తాను అడుగుతున్నానని ప్రశ్నించారు బండి సంజయ్.
కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్లపై.. హస్తం నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. రాహుల్ గాంధీ కులం, మతంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల విషయంలో కౌంటరిచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబమని.. వాళ్లది హిందూ మతమని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక గాంధీ కుటుంబం కుల మతాలను వదిలేసిందని చెప్పారు. ఏ రోజు కూడా రాజకీయాల కోసం కులమతాలను వాడుకోలేదని చెప్పారు. బండి సంజయ్ తో పాటుగా బీజేపీ నేతలు విమర్శలు చేసేముందు ఒకసారి హిస్టరీ చెక్ చేసుకోవాలని సూచించారు జగ్గారెడ్డి.
విద్వేషం, విధ్వంసం బీజేపీ విధానమైతే.. ప్రేమ, శాంతి, సమానత్వం కోసం రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని తెలిపారు మంత్రి సీతక్క. రాహుల్ గాంధీపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల విషయంలో సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మతం, అభిమతం కులగణన అని అన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని రాహుల్ గాంధీ కుల గణన కోసం డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. కుల గణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ గాంధీని బీజేపీ టార్గెట్ చేస్తోందని ఆక్షేపించారు. విభజన రాజకీయాలతో పదవులు పొందటం బీజేపీ నైజం అని విమర్శించారు మంత్రి సీతక్క.
కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. రాహుల్ గాంధీ కులంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలను జనం నమ్మరన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం రాహుల్‌ది అని.. అలాంటి కుటుంబాన్ని కించపరిస్తే ఎవరు క్షమించరని హెచ్చరించారు అద్దంకి దయాకర్.