స్వతంత్ర వెబ్ డెస్క్: మోడీ నేతృత్వంలో తెలంగాణలో రామరాజ్యం ఏర్పాటు కోసం కృషి చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఢిల్లీలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…తనను నమ్మి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ ఏ పని అప్పగించినా బాధ్యతాయుతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్ వస్తున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలను, తోరణాలను పోలీసులు తొలగించారు. దీనిపై పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బండి సంజయ్‌పై కేసీఆర్ సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం? బీజేపీకి ఒక న్యాయమా? అంటూ ఫ్లెక్సీలు తొలగించిన పోలీసులను నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఫ్లెక్సీలను తొలగిస్తున్న పోలీసులు… బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను ఎందుకు తొలగించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్లు పోలీసులు చెప్పారని నేతలు వెల్లడించారు.