స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తాను టికెట్ ఇప్పించిన వారే తనపై అధిష్ఠానానికి తప్పుగా ఫిర్యాదు చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలాంటి వాళ్లతో కావాలనే కొందరు అలా చేయిస్తున్నారని ఆరోపించారు. తనకు ఇతర పార్టీల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని.. చివరి శ్వాస వరకు వైసీపీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. మూడు జిల్లాలు తిరుగుతూ సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించడం కుదరటం లేదనే ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతలు వద్దని సీఎం జగన్ కు చెప్పానని తెలిపారు.
కార్యకర్తల కోసం తన రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడ్డా.. వాళ్ల కోసం వెనుకే ఉంటానని చెబుతూ కంటతడి పెట్టారు. పార్టీ మీద ప్రేమ లేని వారు పార్టీని భ్రష్టుపట్టించాలని చూస్తున్నారని తెలిపారు. వారిపై అధిష్ఠానం చర్యలు తీసుకుంటే మంచిదని.. ఈ వివాదాలకు ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నానని బాలినేని వెల్లడించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న తనను ఎందుకిలా బాధపెడుతున్నారంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 1999లో తనకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టారని, ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి ప్రోత్సహించారన్నారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టాడని తెలంగాణ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు చెబుతున్నారు. 1979లోనే మా నాన్న జనతా పార్టీ తరఫున పోటీ చేశారు.. రాజకీయాల్లో ఎవరి ఫ్యామిలీ ముందో ఆయన తెలుసుకోవాలని హితవు పలికారు. తాను వందల కోట్లు సంపాదించుకున్నానని ఎక్కడో తెలంగాణలో ఉన్న గోనె ప్రకాశ్ అంటున్నారని.. అవి ఎక్కడ ఉన్నాయో చెబితే వెళ్లి తెచ్చుకుంటానని ఎద్దేవాచేశారు. ఇలాంటి మాటలన్ని ఆయన ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్లు ఉందన్నారు బాలినేని.