అయోధ్యను అతి పెద్ద పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు ప్రైవేటు వ్యక్తులు కూడా అప్పుడే రంగంలోకి దిగారు. అయోధ్య లోని సరయూ నదిలో సౌరశక్తితో నడిచే క్రూజ్ షిప్ ఆపరేట్ చేసేందుకు అలకనంద క్రూజ్ కంపెనీ సిద్ధమైంది. వారణాశిలో ఇప్పటికే ఈ కంపెనీ నాలుగు సౌరశక్తితో నడిచే క్రూజ్‌లను ఆపరేట్ చేస్తోంది.
అయోధ్యలో భవ్య రామ మందిరం జనవరి 20న ప్రారంభమవుతుందని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అంతకు ముందే రెండు మినీ సోలార్ క్రూజ్ షిప్ లను సరయూ నదిలో ఆపరేట్ చేయడం ఆరంభిస్తామని అలకనంద క్రూజ్ కంపెనీ డైరెక్టర్ వికాశ్ మాలవీయ ప్రకటించారు. ప్రతి నౌక పూర్తి ఎయిర్ కండీషన్డ్ సౌకర్యంతో 30 మంది పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా ఉంటాయి.
రామాయణ్ నౌకల్లో … రామాయణానికి సంబంధించిన చిత్రాలు ప్రదర్శిస్తారు. శ్రీరామ చంద్రుడి బాల్యం, గురుకుల విద్యాభ్యాసం, స్వయంవరం, అరణ్యవాసం, నుంచి రావణ సంహారం అయోధ్య లో పట్టాభిషేకం వరకూ అన్ని తెలిపే.. చిత్రాలు ప్రదర్శిస్తారు. ఆడియో, వీడియోలు కూడా సిద్ధం చేస్తున్నారు. సరయూనది.. అయోధ్య ఘాట్ లను దర్శింపజేస్తారు. క్రూజ్ షిప్ లవల్ల పర్యాటకం అభివృద్ధి చెందగలదని పర్యాటక శాఖ భావిస్తోంది.