రష్యాలోని కజాన్‌లో బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సదస్సులో తొలుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. బ్రిక్స్ కూటమిలో చేరడానికి 30 దేశాలు ఆసక్తిగా ఉన్నాయని చెప్పారు. అయితే కూటమి విస్తరణ కోసం ఎవరినిపడితే వారిని చేర్చుకోదల్చుకోలేదని, సమర్థంగా పని చేయడాన్ని దృష్టిలో పెట్టుకొనే గ్రూపు విస్తరణపై చర్చిస్తామని తెలిపారు.
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధినేత జీ జిన్‌పింగ్, ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తదితర ప్రపంచ నేతలు ఆ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం బ్రిక్స్ ఫ్యామిలీ అంతా కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఫ్యామిలీ ఫొటో సెషన్ సందర్భంగా మోదీ, యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.