Stomach Ulcers| ఇటీవల కాలంలో చాలా మంది అల్సర్ తో బాధపడుతుంటారు. ఏది తిన్నా కడుపు మండటంతో నరకం చూస్తుంటారు. పొట్టలోని మ్యూకోజ పొరకు చిరుగులు ఏర్పడటంతో తిన్న ప్రతిసారి తీవ్రమైన మంట, కడుపునొప్పి వేధిస్తూ ఉంటాయి.ఇందుకు గల కారణం ఆధునిక జీవనశైలి, గాడితప్పిన ఆహార అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి, స్మోకింగ్, ఆల్కహాల్. నొప్పి విపరీతం అయినపుడు దీనిని ఎలా తగ్గించుకోవాలిరా దేవుడా? అంటూ ఆవేదన చెందుతుంటారు. అయితే వీరు బయపడాల్సిన అవసరం లేదని.. ఆహారం తీసుకోవడంతో పాటుగా కాస్త ఆరోగ్య చిట్కాలు పాటిస్తే మాత్రం అల్సర్ ను ఇట్టే నయం చేసుకోవచ్చని చెపుతున్నారు ఆరోగ్య నిపుణులు.
మొదటగా..అల్సర్ బారిన పడిన వారు… టీ, కాఫీ, మసాలాలతో కూడిన వంటలు, ఐస్ క్రీంలు, బేకరీ ఫుడ్, బయటి చిరుతిండ్లు అన్నీ తగ్గించాలి. కొన్ని రోజుల పాటు ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. నీటిని ఎక్కువగా తాగాలి. ముఖ్యంగా అల్సర్ ఉన్నవారు ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. బీన్స్, అవకాడోలు, బెర్రీలు, నట్స్, ఓట్స్, బార్లీ, ఆపిల్, క్యారెట్, అవిసె గింజలు, జామకాయ వంటివి తీసుకోవాలి. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఆకు కూరలయిన తోటకూర, పాలకూర, బచ్చలి కూర, మెంతి కూర, గోంగూర వంటివి తీసుకోవాలి. వీటితో పాటుగా కాకరకాయ, గుమ్మడికాయ, సొరకాయ, ముల్లంగి, బీరకాయ వంటి కూరగాయలను నిత్య దినచర్యలో చేర్చుకోవాలి. ఈ కూరలు వండినప్పడు ఇందులో దుకాణాలలో కొన్న ప్యాకెట్ మసాలాలు వేసుకోకూడదు. ఇంట్లో స్వయంగా ధనియాలు, లవంగం వేయించి చేసిన మసాలాను వాడాలి. అందువల్ల కూర టేస్టీతో పాటు.. ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అలాగే.. ఆహారంలో ఉప్పు వాడకాన్ని కొద్దీ కొద్దిగా తగ్గించండి. సర్వ రోగాలు అధిక ఉప్పును వాడటం వల్లే వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.
అలాగే.. తీవ్రమైన అల్సర్ తో బాధపడుతున్న వారు.. కారాన్ని తక్కువగా వాడండి. కొద్దీ రోజులు పూర్తిగా మానేసినా మంచిదే. మరీ ముఖ్యంగా త్వరగా అల్సర్ నుండి కోలుకోవాలనుకుంటే.. తినే అన్నంలో పెరుగును వేసుకోండి. కడుపులోని అల్సర్లను తగ్గించడానికి పెరుగు ఒక గొప్ప ఔషధం. పెరుగులో ఉండే.. ప్రోబయోటిక్స్ కడుపులో ఏర్పడిన పండ్లను త్వరగా మానేలా చేస్తుంది. పొట్ట సంబంధిత వ్యాధులు ఉన్న వారు ప్రతిరోజు పెరుగు లేదా మజ్జిగను తీసుకోవాలని చెపుతున్నారు. అరటిపళ్లు, యాపిల్, ఉల్లి, వెల్లుల్లి తదితర ఆహారపదార్థాల్లో ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని కూడా ఎక్కువగా తీసుకోండి. అసలు కడుపులో పుండ్లు త్వరగా నయం కావాలంటే విటమిన్ సీ ఉన్న పండ్లు తీసుకోవాలి.. ఉసిరి, నిమ్మ బత్తాయి, ద్రాక్ష పండ్ల రసాలను తాగితే అల్సర్ల మంట బాగా తగ్గిపోతుంది.