- సొంతూరుకి వెళ్లేవారి కోసం 6,400 ప్రత్యేక బస్సులు
- రిజర్వేషన్ లో తిరుగు ప్రయాణానికి 10శాతం రాయితీ
అమరావతి: ఈ సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. సంక్రాంతి ప్రత్యేక బస్సుల్ని సాధారణ చార్జీలతోనే నడపాలని నిర్ణయించింది. 25ఏళ్లుగా దసరా, సంక్రాంతి సీజన్ లో ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకుంటున్న ఏపీఎస్ఆర్టీసీ ఈ ఏడాది దసరాకి టికెట్ రేట్లని పెంచలేదు. అలాగే, రానున్న సంక్రాంతికి కూడా రెగ్యులర్ చార్జీలతోనే ప్రత్యేక సర్వీసుల్ని నడపడానికి ముందుకొస్తోందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి సొంతూరుకి వెళ్లే ప్రయాణికుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 6,400 ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నామన్నారు. హైదరాబాద్ లోని అన్ని పాయింట్ల నుంచి ప్రత్యేక సర్వీసులు నడుస్తాయని, తిరుగు ప్రయాణానికి ముందుగా రిజర్వేషన్ చేయించుకున్న వారికి చార్జీలో 10శాతం రాయితీ కల్పిస్తామని పేర్కొన్నారు.