ఏమిటో ఈ మాయ అనుకున్నా, ఇదేం వింత అనుకున్నా….ఇందు, అందు, ఎందెందు చూసినా హాయ్ అంటూ ఏఐ పలకరించే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఏదైనా ఒరిజనల్ ఉండాలి కాని ఆర్టిఫిషియల్ ఏమిటి..అని పెదవి విరిచేవారు సైతం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ భజన చేస్తున్నారు. ఏఐ యే క్యా హై..? అనేవాళ్లు ఇప్పుడు అక్కడక్కడ కనిపించినా.. సమీప భవిష్యత్ లో స్మార్ట్ ఫోన్ ను వినియోగించే 90 కోట్ల వినియోగదారులను ఏఐ బీటవుట్ చేసేస్తుందని యావత్ విశ్వంలోని ప్రజలు నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పాత్ర కీలకమని ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కు చెందిన ఓ బడా మేనేజర్ తేల్చి చెప్పేశారు. కోడ్ వితౌట్ బ్యారియర్స్ అనే ఈవెంట్ లో విద్యార్థులకు ఏఐ ఆవశ్యకత వివరించారు. టెక్నికల్, ప్రొఫెషనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడంలో విద్యార్థులు ఎప్పుడూ ముందుండాలన్నారు.
మాయా లేదు మంత్రం లేదు.. అంటూ మెజీషియన్లు తమ అద్భుత ప్రదర్శనలతో చూపరులను రంజింప చేయడం మనకు తెలుసు. తోలు బొమ్మలాటలో…బొమ్మల తైతక్కలాట వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. మాట్లాడే బొమ్మ తెగ కబుర్లు చెప్పి నవ్వించి, మురిపించి మైమరపించేస్తుంది. అయితే, అక్కడ మెజిషియన్, ఇక్కడ తోలుబొమ్మలాట కళాకారుడు, మాట్లాడే బొమ్మను పలికించే మరో వెంట్రిలాక్టివ్ హీరో ఈ ప్రదర్శనల వెనుక ఉంటారు. ఇప్పుడు.. అందరిని అదరగొట్టేసి, బెదర గొట్టేస్తున్న ఏఐ వెనుక మానవ హస్తం ఉంటుంది. అయితే, అంతా సాంకేతికంగా, రోబోటిక్ గా, ఆండ్రాయిడ్ గా ఉంటుంది. వెనుక ఉండి కథ నడిపేది.. మనిషే అయినా.. ప్రతిభాశీలత చూపేది ఆర్టిఫిషియల్ టెక్నాలజీయే. ఎన్నో, ఎన్నెన్నో రంగాల్లో ఏఐ దూసుకెళ్లిపోతోంది. అయితే, అందరికీ చిరపరిచితంగా ఉండే సినిమా,రాజకీయ రంగాలు ప్రాధాన్య రంగాలుగా గుర్తింపబడ్డాయి కదా.. కాబట్టి ఏఐకి సంబంధించి వీటి విషయాలను పరిశీలిద్దాం.
చలన చిత్రాల్లో ప్రత్యేకించి జానపద చిత్రాల్లో ఎన్నో మాయలు, మంత్రాలు, తంత్రాలు మనం చూశాం. ఈ జిమ్మిక్స్ అంతా విజువల్ టెక్నాలజీయే కదా…! ఇదే రీతిలో సాంకేతిక పరిజ్ఞానం, మేధో పరిజ్ఞానం, ఇంతింతై, అంతంతై…అన్నట్టు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగింది. గగనమంత ఎత్తు ఎదిగిన ఈ టెక్నాలజీ అసలు సిసలు ఒరిజనలే. పూర్వం కనికట్టులు, మాయలు, మంత్రాల హవా సాగగా, ఇప్పడు విజువల్స్ జిమ్మిక్స్ సాగుతున్నాయి. తాజా ఈ ఆర్టిఫిషియల్ అభివృద్ది చెంది.. ఆర్టిఫిషియల్ టెక్నాలజీగా మారింది.
చాలాకాలం క్రితం వచ్చిన మాయా బజార్ సినిమా ఘట్టాలు తీసుకుంటే.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ కు అది ఆరిజన్ ఏమో అనిపిస్తుంది. ఏది కోరితే అది క్షణాల్లో రప్పించేయడం, అవసరం లేకపోతే మాయం చేసేయడం.. ఈ మాయలు, మంత్రాలు ఈ మూవీలో ఎన్నో కనిపిస్తాయి. అల్లాఉద్దీన్ అద్భుత దీపాన్ని తలపిస్తాయి. అయితే, ఇవన్నీ వినోద హస్య సన్నివేశాలు, సినిమా విశేషాలు కాబట్టి.. వీలైనన్ని సార్లు ఆ సినిమా చూసేసి, ఆనందం పొందేసి.. మన పనుల్లో నిమగ్నమయ్యాం. అయితే,ఇప్పుడు పనుల్లో బిజీగా ఉన్నాం అనే వాళ్లకంటే లేజీగా తిరుగుతున్నాం అనే వాళ్ల సంఖ్య పెరిగిపోయేలా ఉందని ఏఐ గురించి భయపడేవాళ్లు అంటున్నారు. కృత్రిమ మేధతో పనులు, కొలువులు, వృత్తులు, వ్యాపారాలు.. టోటల్ గల్లంతయ్యే పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. ఇది నిజమేనా..? ఏఐ ఎందరి నోళ్లో మూయించేసి, అందరి పొట్టలు కొట్టేస్తుందా..? ఏఐ తన ఆధిపత్యం ప్రదర్శించేస్తే.. అన్నిరంగాలు నిరుద్యోగులతో నిండిపోతాయా..? ఇలాంటి సందేహాలెన్నో ప్రజల్లో తలెత్తుతున్నాయి.
ఎక్కడబడితే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పై చర్చలు జరుగుతున్న వేళ.. ఇప్పటికే పలు రంగాల్లో దీని ప్రభావం మొదలైన వేళ…. సినిమా రంగంలో మ్యూజిక్ విభాగం గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మ్యూజిక్ విభాగంపై, సంగీత దర్శకులపై ఏఐ ప్రభావం బాగా చూపనుందని ఊహాగానాలు వస్తున్నాయి. నెట్టింట ఏఐ మ్యూజిక్ యాప్స్ కొన్ని అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్స్ మ్యూజిక్ డైరెక్టర్ల పొట్ట కొట్టేస్తాయని సినీవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. లిరిక్స్ అందిస్తే క్షణాల్లో పాట రెడీ చేసేయడం, ట్యూన్ కట్టి సింగర్ వాయిస్, మ్యూజిక్ తో సహా ఇచ్చేయడం ఏఐ చేసేస్తుంది. ఏ ట్యూన్ కావాలి, ఎవరి వాయిస్ కావాలి అనే విషయాలు తెలియపరిస్తే టోటల్ రెడీ అయిపోతుంది. సినిమాకు సంగీతం అంటే.. మ్యూజిక్ డైరెక్టర్ కథ తెలుసుకోవాలి, పాటల రచయితతో సంప్రదించాలి, డైరెక్టర్, ప్రొడ్యూసర్ లకు నచ్చాలి. హీరో ఓకే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ సంగీతంలో డైరెక్టర్ సూచనలకు అనుగుణంగా వెళ్లాలి..ఈ తంతులన్నీ పూర్తవ్వడానికి నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. ఇదేకాక ట్రైలర్లు, ప్రమోషన్ వీడియోలు.. ఇలా ఎన్నో ఉంటాయి. అసలు గేయ రచనే ఏఐ చేసేస్తుందనే టాక్స్ వినవస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజకు తావు లేదనే వారు, సీన్ రివర్స్ అయితే… ఏ వ్యక్తిపై, ఏ పార్టీపై, ఏ అధినేతపై రాజకీయ విమర్శలు గుప్పించారో.. ఆ పార్టీ తీర్థం పుచ్చేసుకుని, ఆ నేతలకు సలాం కొట్టేసి గులాంలు అయిపోవడం.. పదవులు, అధికారాలు, సన్మానాలు, బిరుదల నడుమ తేలియాడడం మనం చూస్తుంటాం. అయితే, ఏఐ ఎంటరైందంటే పొలిటీషిన్లను సైడ్ చేసేసి, ప్రజల జీవితాలు మార్చేసే నిర్ణయాలు తీసేసుకునే స్థాయి వచ్చేస్తుందని తెలుస్తోంది. ఏఐ అల్గారిథమ్స్ ద్వారా పరిపాలించడాన్ని అల్గో క్రసీగా ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. దీనిపై పాశ్చాత్య దేశాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నట్టు సమాచారం. రాజకీయ నాయకుల కంటే కృత్రిమ మేథ తీసుకునే నిర్ణయాలే నిష్పక్షపాతంగా , నిజంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటాయని అల్గోక్రసీని బలంగా నమ్మేవారు చెబుతున్నారు. బంధు,మిత్ర, వర్గ పక్షపాతాలు, ఈర్ష్యాసూయ, ద్వేషాలతో ఏ పక్షవాతాలకో గురయ్యే పరిస్థితులు ఏఐలో ఉండవని అంటున్నారు. ఓటు బ్యాంకు గోలలు, సొమ్ము, పేరు, ప్రతిష్ఠ ల కోసం పాకులాటలు… ఏవీ ఇందులో ఉండవని, సమగ్రాభివృద్దిపై దృష్టి సారింపు, నిర్ణయాలే ఉంటాయని అంటున్నారు. కొన్ని దేశాల్లో జరిగిన ఎన్నికల్లో వర్చువల్ పొలిటీషియన్ల పేరు బలంగా తెరపైకి వచ్చేలా ఈ వ్యవహారం వచ్చిందంటే..ఏఐ మజాకా ఏమిటో తెలుస్తోంది కదా..!
దగ్గర దగ్గర ఎనిమిదేళ్ల క్రితం న్యూజిలాండ్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ప్రముఖుడు… భవిష్యత్ రాజకీయ నేత అనే పేరుతో వర్చువల్ పొలిటీయన్ ను సృష్టించాడు. చాట్ జీపీటీ టైప్ లో ఈ వర్చువల్ పొలిటీషియన్ పై అష్టావధానం, శతవధానం, సహస్రావధానం మాదిరి ఏ ప్రశ్నలు సంధించినా.. మైండ్ డేటాతో ఠక్కున సమాధానం ఇచ్చేశాడు. అయితే, పాపం ఈ వర్చువల్ పొలిటీషిన్ సార్ కు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉన్నా… పోటీకి అనుమతి లేదని చట్టాలు చెప్పేయడంతో..కామ్ అయిపోయాడు. అయితే, టోక్యోలో ఒక హ్యుమనాయిడ్ రోబో మేయర్ ఎన్నికల్లో పోటీకి దిగినట్టు ఇటీవల చరిత్ర చెబుతోంది. దాన్ని అభివృద్ది చేసిన పెద్దమనిషి.. దాని ప్రతినిధిగా వ్యవహరించి పెద్ద ఎత్తున ప్రచారం సైతం చేయడమే కాకుండా.. ఆ రోబోను ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నూతన ఫీచర్ గా అభివర్ణించేశాడు.
అన్నింటా నేనుంటా.. అంటూ ఏఐ రెచ్చిపోతుంటే.. ఇక అందరూ పిచ్చివాళ్లలా మారిపోవడమేనా.. కొలువులు, పదవులు.. అన్ని కోల్పోయి విచారసాగరంలో మునిగిపోవడమేనా అంటే… కొందరు ఆశావహ దృక్పథ మేధావి వర్గం ప్రజలు.. డోంట్ ఫియర్ అంటున్నారు. ఎన్ని ఏఐలు వచ్చినా.. అవన్నీ వెనక్కాల ఎవరో ఒకరు ఉండి నడిపించాల్సినవే. ఆ నడిపించేది మనుషులే కదా..! ఆర్టిఫిషియల్ ఒరిజనల్ కు పాతర పెట్టే పరిస్థితులు తెస్తే, తోక జాడించే స్థాయికి ఏఐ చేరితే…దాన్ని కంట్రోల్ చేసే మానవ మేధావి ఊరుకోడుగా..అందుకే భయం లేదని ఆశావహ దృక్పథ మేధావులు భరోసా మాటలు మాట్లాడుతున్నారు. పాత విజ్ఞానంతోనే కొత్త వింతలు పుట్టుకొస్తాయని, కొత్త వింతైనా, పాత రోత కాదని, ఎక్స్ పీరియన్స్, ఒరిజనల్ టాలెంట్ కు ఎప్పుడూ ఢోకా ఉండదని అంటున్నారు. కంప్యూటరైజేషన్ అవుతున్న కాలంలో.. ఇక ఉద్యోగాలు గల్లంతే, బతుకులు బస్టాండే అని ఏడుపులు, పెడబొబ్బలు పెట్టడం జరిగింది కదా..? ఏమైంది కంప్యూటర్లు వచ్చాక కొలువులు మరింత పెరిగిపోయాయి. సాఫ్ట్ వేర్ లు, హార్డ్ వేర్లు, ఇంజనీర్లు…ఎన్నడూ కనీవినీ ఎరుగనంతా జీతాలతో.. విశ్వనలుమూలల సాఫ్ట్ గా కొలువులు చేసేసుకుంటూ..లక్షలు, కోట్లకు పడగలెత్తుతున్నవారు మన కళ్లముందే లేరా.. అందుకే ఏ ఒళ్లు జలదరింపులు పెట్టుకోకుండా, ఏఐల బెదిరింపులు పట్టించుకోకుండా.. కామ్ గా ఎవరి కర్తవ్యాన్ని వారు త్రికరణశుద్ధిగా నిర్వహిస్తే…ఏఐను డోంట్ కేర్ అనేయవచ్చని అంటున్నారు.
————-