ఆంధ్రప్రదేశ్‌ను బొమ్మల ఎగుమతుల హబ్‌గా మార్చేందుకు విస్తృత స్థాయిలో రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే రాష్ట్రంలో టాయ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటుందని పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. ఒక పక్క కొండపల్లి, ఏటి కుప్పాకలో సాంప్రదాయ చెక్క బొమ్మల తయారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే, అత్యాధునిక సాఫ్ట్ టాయ్‌ల తయారీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది బొమ్మల పరిశ్రమ.
బొమ్మలు అనగానే చాల మందికి లక్కపిడతలే గుర్తుకువస్తాయి. ఒకప్పుడు బొమ్మలు అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కొండపల్లి బొమ్మలు, ఏటి కుప్పాకలో తయారయ్యే చెక్క బొమ్మలు.. కొన్ని తరాల పిల్లలు ఆ బొమ్మలతోనే ఆడుకున్నారు. తర్వాత గుడ్డలతో తయారు చేసిన బొమ్మలు వచ్చాయి. ప్లాస్టిక్ అందుబాటులోకి వచ్చేక కీ ఇచ్చే బొమ్మలు, కార్లు, ఇలా రకరకాల బొమ్మలు వచ్చేశాయి. కానీ.. తరాలు మారాయి.. పిల్లల అభిరుచులు.. మారాయి. కొత్త కొత్త బొమ్మలు. తయారయ్యాయి. బొమ్మల తయారీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలో చిన్న గ్రామం ఏటి కుప్పాక. చెక్క బొమ్మల తయారీ కళాకారుల కేంద్రం. లక్కపిడతల నుంచి సాంప్రదాయ బొమ్మలు, పర్యావరణానికి హానిచేయని చెక్కబొమ్మల తయారీ కేంద్రం. శతాబ్ది కాలంగా ఇదే వృత్తిలో ఉన్న దాదాపు 150 నుంచి 200 కుటుంబాలకు ఈ బొమ్మల తయారీయే ప్రధాన ఉపాధి. ఈ బొమ్మలకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి పలు దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఎన్ ఆర్ ఐలు ఈ సాంప్రదాయ బొమ్మలనే ఇష్టపడుతున్నారు. దీంతో ఏటి కుప్పాకలో ప్రతినెలా 30 నుంచి 50 లక్షల బొమ్మలు తయారవుతున్నాయి. ఈ బొమ్మల ఎగుమతి ద్వారా కోట్ల రూపాయల విదేశీ మారకం లభిస్తోంది. కొండపల్లి బొమ్మలు కోట్లరూపాయల ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి.
ఇటీవల కాలంలో సాంప్రదాయ చెక్కబొమ్మలకన్నా.. పిల్లలు అత్యాధునిక సాఫ్ట్ టాయ్స్ అంటే ఇష్టపడుతున్నారు. బొమ్మల తయారీలో చైనా.. రకరకాల ఆకృతుల్లో బొమ్మలు తయారు చేసి ప్రపంచ మార్కెట్ లో నెంబర్ 1 స్థానాన్ని చేరింది. బొమ్మల ఎగుమతులతోనే బిలియన్ల డాలర్లు ఆర్జిస్తోంది. భారతీయ మార్కెట్ ను గతంలో చైనా బొమ్మలే ఆక్రమించేశాయి. టెడ్డీ బేర్ లు.. రకరకాల ఆకృతుల బొమ్మల పట్ల ఇప్పటి పిల్లలు చూపుతున్న ఆసక్తి గమనించిన మన పారిశ్రామిక వేత్తలు ఈ రంగం పై దృష్టి పెట్టారు.
విశాఖపట్నం జిల్లా గాజువాక లోని గ్రీన్ సిటీలో పల్స్ ప్లష్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొత్త కొత్త ఆకృతుల బొమ్మల తయారీపై దృష్టి పెట్టింది. కాకినాడలో జీఎంఆర్ భారతదేశంలోనే అతిపెద్దబొమ్మల హబ్ ను ఏర్పాటు చేసింది. పల్స్ ప్లష్ సంస్థ సాఫ్ట్ టాయ్ ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది. కాకినాడలో సాఫ్ట్ బొమ్మల తయారీ పెద్దఎత్తున జరుగుతోంది. అలాగే తిరుపతి లోని శ్రీ సిటీ లోనూ పలు పరిశ్రమలు రక రకాల బొమ్మల ను తయారు చేస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ బొమ్మల ఎగుమతిహబ్ గా మారుతోంది. విలాసవంతమైన బొమ్మలతో మార్కెట్ లు కళకళలాడుతున్నాయి. బొమ్మల ఎగుమతులు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. గాజువాక పల్స్ ప్లష్ ఇండియా సంస్థ బొమ్మలు అమెరికాలోని న్యూయార్క్, ఫ్లోరిడా, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి గుడివాడ అమర్ నాథ్ ఇటీవల గ్లోబల్ ఈ కామర్స్ పోర్టల్ ను ప్రారంభించారు.
సాఫ్ట్ టాయిస్ పరిశ్రమల తయారీ పరిశ్రమల్లో దాదాపు 30 వేల మందికి ఉపాధి కలుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తయారైన బొమ్మలు ప్రతిఏటా 8 వేల కోట్ల రూపాయల మేరకు దేశ, విదేశాల్లో ఆర్డర్లు పొందుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో టాయ్ పార్క్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు కూడా వచ్చాయని.. ప్రస్తుతం టాయ్ పార్క్ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. దేశంలో ఆధునిక బొమ్మల పరిశ్రమ 30 ఏళ్లుగా అభివృద్ధి చెందుతోంది పల్స్ ప్లష్ ఇండియా కంపెనీ 1997 -2000 సంవత్సరాల మధ్యే తైవాన్, దక్షిణ కొరియా ఇతర దేశాలకు బొమ్మలను ఎగుమతి చేసింది. 2011-12 లో తిరుపతి లోని శ్రీ సిటీ లో బొమ్మల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసింది. అటు సాంప్రదాయ చెక్కబొమ్మల పరిశ్రమలతో పాటు , అత్యాధునిక బొమ్మల తయారీని ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతి పెద్ద బొమ్మల ఎగుమతి హబ్ అయ్యే అవకాశం ఉంది.