స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అంతర్గత ఘర్షణలతో భగ్గమంటోన్న మణిపూర్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థుల తరలింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మణిపూర్ లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు 100మంది విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసుకున్నారని.. మరో 50మంది విద్యార్థులు ఉండొచ్చని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. విమానయానశాఖ మంత్రితో మాట్లాడి వారిని తీసుకువచ్చేందుక ప్రత్యేక విమానం ఏర్పాటుశామని వెల్లడించారు. అందుచేత విద్యార్థులు, వారి తల్లిండ్రులు ఎటువంటి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.
విద్యార్థుల తరలింపు ప్రక్రియను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్(నెంబర్:88009 25668), ఏపీ భవన్ ఓఎస్డీ రవిశంకర్(నెంబర్: 91871 99905) పర్యవేక్షిస్తున్నారని బొత్స వెల్లడించారు. కాగా కొన్నిరోజులుగా మణిపూర్ లో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఎస్టీ హోదా వివాదం నేపథ్యంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ ఘర్షణల్లో 50మందికి పైగా మరణించారు.